విజయసాయిరెడ్డికి సజ్జల హెచ్చరిక
'జగన్‌పై విమర్శలు చేస్తే సహించేది లేదు'
తాడేపల్లి: తప్పుడు కేసుల వల్ల విజయసాయిరెడ్డి ఇబ్బందులు పడ్డారనే సానుభూతితోనే ఆయనపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక అభిమానం చూపించారని వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ ఇచ్చిన పదవులన్నీ తన సొంత ప్రతిభ వల్లనే వచ్చాయని సాయిరెడ్డి భావించి ఉండవచ్చని ఆయన అన్నారు. మీడియాతో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తనకున్న ప్రతిభతో కొత్త పార్టీ పెట్టుకోవాలని విజయసాయిరెడ్డి అనుకోవడంలో తప్పులేదు. కొత్త పార్టీ ప్రచారం కోసం, పచ్చ మీడియాలో కవరేజ్ (స్పేస్) పొందడం కోసం వైఎస్సార్‌సీపీపై, జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు. సాయిరెడ్డి చేసే ఇటువంటి విమర్శల వల్ల జగన్ మోహన్ రెడ్డి గారికి పోయేది ఏమీ లేదని సజ్జల స్పష్టం చేశారు.