andhrapradesh
అరకులో ‘సంజీవని’ ప్రారంభం: ప్రజా వేదిక సభలో చంద్రబాబు కీలక ప్రసంగం
అరకు:గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు వారి ఇంటి వద్దకే మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘సంజీవని’ (Sanjeevani) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గంలోని అరకు మండలం గన్నెల పంచాయతీ ఆర్కే నగర్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ సంజీవని కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. గన్నెలలో ఏర్పాటు చేసిన అత్యాధునిక ‘ఆరోగ్య రథాలను’ ఆయన జెండా ఊపి ప్రారంభించి, క్షేత్రస్థాయి వైద్య సేవల తీరును పరిశీలించారు. అరకు పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రికి జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.
ఇంటి వద్దకే వైద్యం – డిజిటల్ హెల్త్ రికార్డులే లక్ష్యం
ఈ సంజీవని కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం గన్నెలిలో ఏర్పాటు చేసిన ‘ప్రజా వేదిక’ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. గిరిజన ప్రాంతాల్లో రవాణా, భౌగోళిక ఇబ్బందుల వల్ల వైద్య సేవలు సకాలంలో అందడం లేదని, ఆ లోటును భర్తీ చేయడానికే ఈ ఆరోగ్య రథాలను రంగంలోకి దించినట్లు పేర్కొన్నారు.
డిజిటల్ హెల్త్ రికార్డులతో కూడిన ఈ సంజీవని ప్రాజెక్టును రాబోయే రోజుల్లో మరింత విస్తృతం చేయనున్నారు. రాబోయే జనవరి 1 నుండి ఈ ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీనివల్ల ప్రతి ఒక్క పౌరుడి ఆరోగ్య సమాచారం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. తద్వారా అత్యవసర సమయాల్లో వైద్య సేవలు అందించడం మరింత సులభతరం అవుతుందని ముఖ్యమంత్రి వివరించారు.
ఈ పర్యటనలో ముఖ్యమంత్రితో పాటు స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు మరియు భారీ సంఖ్యలో గిరిజన ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.