national
న్యూఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం: టింబర్ ఫ్యాక్టరీలో ఎగిసిపడిన మంటలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని పశ్చిమ ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాజధాని మెట్రో స్టేషన్ సమీపంలోని అసోం టింబర్ మార్కెట్‌లో ఉన్న ఒక కలప (టింబర్), ప్లైవుడ్ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు ఫ్యాక్టరీ మొత్తం వ్యాపించి దట్టమైన పొగలు అలుముకున్నాయి.
ఆదివారం తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో కలప గోడౌన్‌లో మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ప్రమాద తీవ్రతను గమనించిన ఢిల్లీ ఫైర్ సర్వీస్ (DFS) అధికారులు రంగంలోకి దిగి, మంటలను అదుపు చేయడానికి ఏకంగా 25 ఫైర్ ఇంజన్లను ఘటనా స్థలానికి తరలించారు. ఫైర్ సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
తప్పిన ప్రాణనష్టం
ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అగ్నిమాపక శాఖ అధికారులు ధృవీకరించారు. అయితే ఫ్యాక్టరీలోని కలప, విలువైన యంత్రాలు పూర్తిగా కాలి బూడిదవడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు యాజమాన్యం పేర్కొంది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.