రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
లబ్ధిదారులకు స్మార్ట్ కార్డుల పంపిణీ
రైతులకు మందు పిచికారీ పంపులు, విత్తనాల అందజేత
వికారాబాద్ జిల్లా ప్రతినిధి , మేజర్ న్యూస్ (ఆగస్టు 30):
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఎ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. వికారాబాద్ జిల్లా దారూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేయడంతో పాటు రైతులకు మందు పిచికారీ పంపులు, విత్తనాలను అందజేశారు.
రైతులకు ప్రభుత్వం అండగా
ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. రైతులకు అవసరమైన వ్యవసాయ వనరులను అందుబాటులోకి తీసుకువచ్చి వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, వ్యవసాయ పరికరాలు అందించడం ద్వారా సాగు ఖర్చులను తగ్గించి, దిగుబడులను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, వ్యవసాయ పథకాలను అర్హులైన లబ్ధిదారులు, రైతులు సద్వినియోగం చేసుకోవాలని స్పీకర్ సూచించారు. వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులను అవలంబిస్తూ అధిక దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు.
అర్హులందరికీ ప్రయోజనాలు
ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని గడ్డం ప్రసాద్ కుమార్ సూచించారు. రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కవిత,వ్యవసాయ శాఖ అధికారులు, వివిధ శాఖల అధికారులు, రైతులు, లబ్ధిదారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.