బాల సంజీవని టెండర్లలో అవకతవకలు, నిబంధనల ఉల్లంఘనలపై సమగ్ర విచారణ జరిపించాలి-AIYF
డిఆర్ఓ రామ్ నాయక్ కు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో వినతి పత్రం
నంద్యాల అర్బన్: ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి జి నాగరాముడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు బాల సంజీవని, బాల సంజీవని ట్రైబల్ పథకాలను అమలు చేస్తోంది. రాష్ట్రంలోని 26 జిల్లాలను నాలుగు యూనిట్లుగా విభజించి నిర్వహించిన తాజా టెండర్లలో పారదర్శకత, పోటీ, నిబంధనల అమలుపై అనేక అనుమానాలు, ఫిర్యాదులు వెలువడుతున్నాయి.టెండర్లలో స్థానిక మహిళా స్వయం సహాయక సంఘాలు, చిన్న–మధ్య తరహా పరిశ్రమలకు అవకాశం లేకుండా, 5,583 డెలివరీ పాయింట్ల వంటి అర్హతలను విధించడం ద్వారా కొద్దిమంది పెద్ద సంస్థలకే ప్రయోజనం కలిగేలా నిబంధనలు రూపొందించారనే ఆరోపణలు ఉన్నాయి. పోషణ పథకాలలో SHGల భాగస్వామ్యానికి ఉన్న విధానపరమైన ప్రాధాన్యతను ప్రభుత్వం విస్మరించకూడదు.టెండర్‌లో సొంత తయారీ యూనిట్, ఫుడ్ సేఫ్టీ లైసెన్స్, ఉత్పత్తి సామర్థ్యం వంటి అర్హతలు ఉన్నప్పటికీ, సొంత తయారీ యూనిట్లు లేని కేంద్రీయ భండార్, NCCF వంటి సంస్థలకు ఏ ప్రాతిపదికన అర్హత కల్పించారో ప్రభుత్వం స్పష్టం చేయాలి. గతంలో ఇదే కారణాలతో అనర్హతకు గురైన సంస్థలు ఇప్పుడు ఎలా అర్హత సాధించాయో విచారించాలి.
అదేవిధంగా సాధారణ కిట్ ధర రూ.241 నుంచి రూ.283.19కు, ట్రైబల్ కిట్ ధర రూ.350 నుంచి రూ.446కు పెరిగినట్లు ఉన్న నేపథ్యంలో, ధరల పెరుగుదలకు సంబంధించిన పూర్తి Cost Sheet, Technical/Financial Evaluation వివరాలను బహిర్గతం చేయాలి. పలువురు బిడ్డర్లు ఒకే ధరను కోట్ చేసినట్లయితే, పోటీ నిజంగా జరిగిందా లేదా సిండికేషన్ జరిగిందా అనే అంశంపై e-Procurement రికార్డులతో సహా విచారణ జరపాలి*
ప్రస్తుత బాల సంజీవని టెండర్లపై స్వతంత్ర సమగ్ర విచారణ జరిపించాలి.
నిబంధనలకు విరుద్ధంగా అర్హత పొందిన సంస్థల కాంట్రాక్టులను రద్దు చేయాలి.
తయారీ యూనిట్, ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ తదితర అర్హతలను అందరికీ సమానంగా అమలు చేయాలి.
జోన్ విధానాన్ని రద్దు/పునఃపరిశీలించి జిల్లాల వారీగా టెండర్లు నిర్వహించాలి.
మహిళా SHGలు, స్థానిక చిన్న–మధ్య తరహా పరిశ్రమలకు సమాన అవకాశం కల్పించాలి.
రూ.283.19, రూ.446 ధరల పెరుగుదలకు పూర్తి ఆధారాలను వెల్లడించి, అవసరమైతే రీ-టెండర్ నిర్వహించాలి.
టెండర్‌లో కుమ్మక్కు, నిబంధనల ఉల్లంఘన లేదా ప్రజాధనానికి నష్టం జరిగినట్లు తేలితే బాధ్యులైన అధికారులు, కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి.
పౌష్టికాహార కిట్ల నాణ్యతను బ్యాచ్ వారీగా పరీక్షించి, నివేదికలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
బాలల పౌష్టికాహారం కొద్దిమంది కాంట్రాక్టర్ల లాభాల కోసం కాకుండా, పారదర్శకంగా, నాణ్యతతో, స్థానిక మహిళా సంఘాల భాగస్వామ్యంతో అమలు కావాలి.
కావున ప్రజాధనం మరియు బాలల పౌష్టికాహార ప్రయోజనాలను కాపాడాలని అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) నంద్యాల జిల్లా సమితిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము.
ఈ కార్యక్రమంలో ఉదయ్ కుమార్, రమేష్, మాస్, తదితరులు పాల్గొనడం జరిగింది