ఏపీడబ్ల్యూజేఎఫ్ తొలి జిల్లా మహాసభలకు మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌కు ఆహ్వానం
నంద్యాల అర్బన్:ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలో మొట్టమొదటిసారిగా నిర్వహించనున్న జిల్లా మహాసభలకు ముఖ్య అతిథిగా విచ్చేయాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ను సంఘ నాయకులు ఆహ్వానించారు. మంగళవారం నంద్యాలలో మంత్రి ఫరూక్ ను ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాయకులు జగన్మోహన్, మౌలాలి, మస్తాన్, సుబ్బరాయుడు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు జగన్మోహన్, మౌలాలి, మస్తాన్, సుబ్బరాయుడు మాట్లాడుతూ నంద్యాల జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ జిల్లా మహాసభలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సభల్లో ప్రధానంగా క్షేత్రస్థాయి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి హక్కుల పరిరక్షణ, సంక్షేమ పథకాల అమలు తదితర కీలక అంశాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు . ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరై, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తోడ్పాటు అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి ఫరూక్ ని కోరినట్లు నాయకులు తెలిపారు . ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ప్రతినిధులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.