మ్యూజికల్ లెజెండ్ బయోపిక్‌లో రష్మిక.. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి పాత్రలో నటి!
ప్రముఖ గాయని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక బయోపిక్‌లో నటి రష్మిక ప్రధాన పాత్ర పోషించనున్నారు. చెన్నై వేదికగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రారంభోత్సవం ఘనంగా జరగనుంది.
భారతీయ సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన మహోన్నత గాయని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి జీవితం ఆధారంగా ఓ వెండితెర చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ ప్రతిష్టాత్మక బయోపిక్‌లో టైటిల్ పాత్ర పోషించే అరుదైన అవకాశం టాలీవుడ్, బాలివుడ్ నటి రష్మికను వరించింది. గత కొంతకాలంగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి పలువురి నటీమణుల పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ, తుది కసరత్తుల తరువాత రష్మిక పేరును ఖరారు చేశారు.
'ఎంఎస్: ఏ లెగసీ ఆన్ స్క్రీన్' అనే ఆసక్తికరమైన శీర్షికతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక లాంచ్ ఈవెంట్ బుధవారం సాయంత్రం చెన్నైలో అత్యంత వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరై చిత్రయూనిట్‌ను అభినందించనున్నారు. లాంచింగ్ వేడుక సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇండియన్ చోరల్ ఎన్‌సెంబుల్ బృందం, సుబ్బులక్ష్మి ఆలపించిన కొన్ని మధురమైన గీతాలను ప్రదర్శించి ఘనంగా నివాళులు అర్పించనుంది.
ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. అల్లు అరవింద్, బన్నీవాసు, రాక్ లైన్ వెంకటేశ్ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, 'జెర్సీ' వంటి సున్నితమైన భావోద్వేగ చిత్రాలను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే యువ సంగీత సంచలనం అనిరుధ్ ఈ చిత్రానికి బాణీలు సమకూరుస్తున్నారు. సాధారణ కమర్షియల్ చిత్రాలతో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ వస్తున్న రష్మిక, ఈ క్లాసికల్ బయోపిక్‌లో ఎలా కనిపించబోతున్నారనే దానిపై సినీ వర్గాలలో తీవ్ర ఆసక్తి నెలకొంది.
ఇదిలాఉంటే, రష్మిక వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలోనూ వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో హీరో విజయ్ దేవరకొండను వివాహం చేసుకున్న ఆమె, ఆ తర్వాత వీరిద్దరి కలయికలో వచ్చిన 'రణబాలి' సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రం వచ్చే నెల 16న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. మరోవైపు ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'మైసా' అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రం నవంబర్ 27న విడుదల కానుందని సినీ వర్గాలు వెల్లడించాయి.