ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి
01 సూర్య కరీంనగర్ ప్రతినిధి: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలు విడుదల చేయడం, 51 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలు, ఈహెచ్‌ఎస్‌ను సమర్థంగా అమలు చేయడం, సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించడం, జీవో 317 బాధితులను సొంత జిల్లాలకు సర్దుబాటు చేయడం, ఉద్యోగులు–రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించడం వంటి డిమాండ్లను సమావేశంలో తీర్మానించారు. ఉద్యోగులు ప్రభుత్వానికి బానిసలు కాదని, పరిపాలనలో కీలక భాగస్వాములని హరిప్రసాద్ పేర్కొన్నారు. ఉద్యోగ జేఏసీ చేపట్టే పోరాటానికి తెలంగాణ రక్షణ సేన సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు.