నేతల అరెస్టులపై రోడ్డెక్కిన brs శ్రేణులు
నేతల అరెస్టుపై...
రోడ్డెక్కిన బిఆర్ఎస్ శ్రేణులు
చేవెళ్లలో బీజాపూర్ రహదారిపై బైఠాయింపు –
చేవెళ్ల,మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 7): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో బిఆర్ఎస్ శ్రేణులు భారీ నిరసనకు దిగాయి. తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో మాజీ మంత్రులు కె.టి.రామారావు, తన్నీరు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డిలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో బీజాపూర్ ప్రధాన రహదారిపై పార్టీ కార్యకర్తలు బైఠాయించి ఆందోళన చేపట్టారు.
మండల అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిపక్ష నాయకుల అరెస్టు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, విభిన్న స్వరాలను అణిచివేయడం తగదని మండిపడ్డారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పాలన అవినీతిపరమైందని విమర్శించారు. గులాబీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
అలాగే అసెంబ్లీ సమావేశాలను 30 రోజుల పాటు పొడిగించి, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, మండల స్థాయి నేతలు, మున్సిపాలిటీ పరిధిలోని కార్యకర్తలు పాల్గొన్నారు