ఐజ్వాల్‌లో క్రీడా సౌకర్యాల సమీక్ష
ఐజ్వాల్: కేంద్ర క్రీడల శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే మిజోరం పర్యటనలో భాగంగా ఐజ్వాల్‌లోని క్రీడా వ్యవస్థను, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) కేంద్రాన్ని సందర్శించి సమీక్షించారు. క్రీడా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, ఈశాన్య ప్రాంత యువ క్రీడాకారులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన శిక్షణ, పోషణ, పోటీ అవకాశాలు కల్పించడంపై ఆమె ప్రధానంగా దృష్టి సారించారు. మిజోరం క్రీడల శాఖ సహాయ మంత్రి లాల్‌నింగ్‌లోవా హ్మార్, సాయి సహాయ సంచాలకుడు శివం యాదవ్‌లతో కలిసి కేంద్ర-రాష్ట్ర సమన్వయంపై ఆమె చర్చలు జరిపారు.
ఐజ్వాల్‌లోని సాయి శిక్షణా కేంద్రంలో సింథటిక్ హాకీ టర్ఫ్, లైటింగ్ ఏర్పాటు చేసే ఖేలో ఇండియా ప్రాజెక్టుల ద్వారా మిజోరంలో క్రీడా సౌకర్యాలను మెరుగుపరుస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఫుట్‌బాల్, హాకీలలో మిజోరం ప్రదర్శిస్తున్న ప్రతిభను కొనియాడిన ఆమె, థెన్జావల్ సాయి అకాడమీ నుండి ఎదిగి అర్జున అవార్డు (2025) సాధించిన తొలి మిజోరం మహిళా ఒలింపియన్ లాల్‌రెమ్సియామి విజయాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్థానిక క్రీడాకారులకు వారి ప్రాంతంలోనే మెరుగైన సౌకర్యాలు కల్పించడం ద్వారా ఈశాన్య భారతాన్ని దేశీయ క్రీడా రంగానికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఖడ్సే స్పష్టం చేశారు.