యూపీఐపై ఛార్జీలు పరోక్ష పన్నుతో సమానం.. 66% లావాదేవీలపై ఎండీఆర్ ప్రభావం: అష్నీర్ గ్రోవర్
రూ.2,000 దాటిన లావాదేవీలు విలువ పరంగా 66 శాతం ఉన్నాయని, వాటిపై ఛార్జీలు వేస్తే ఆ భారం వినియోగదారులపైనే పడుతుందని అష్నీర్ గ్రోవర్ విశ్లేషించారు.
బ్యాంకులు వేల కోట్ల లాభాల్లో ఉన్నప్పుడు యూపీఐపై ఛార్జీలు విధించాల్సిన అవసరం ఏముందని భారత్‌పే మాజీ సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ కేంద్రాన్ని ప్రశ్నించారు.
దేశంలో విశేష ప్రజాదరణ పొందిన యూపీఐ (UPI) చెల్లింపులపై ఛార్జీలు విధించే ఆలోచనపై ‘భారత్‌పే’ సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విజయవంతంగా అమలవుతున్న డిజిటల్ చెల్లింపుల వ్యవస్థపై రుసుము వసూలు చేస్తే అది పరోక్షంగా ప్రజలపై పన్ను విధించినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు.
ముఖ్యాంశాలు:
* యూపీఐపై ఛార్జీలు విధిస్తే ప్రజలు, వ్యాపారులు మళ్లీ నగదు వైపు మళ్లే ప్రమాదం.
* రూ.2,000 దాటిన లావాదేవీలపై స్పష్టత లేని తాజా ప్రభుత్వ నోటిఫికేషన్.
* లావాదేవీల పరిమాణంలో 4 శాతమే అయినా, విలువలో 66 శాతం వాటా పెద్ద ట్రాన్సాక్షన్లదే.
* ఎండీఆర్ (MDR) విధిస్తే ఆ భారాన్ని వ్యాపారులు కస్టమర్లపైకి నెట్టే అవకాశం.
* బ్యాంకులు వేల కోట్ల లాభాల్లో ఉన్నప్పుడు యూపీఐ సబ్సిడీని ఎందుకు ప్రశ్నిస్తున్నారని నిలదీత.
మళ్లీ నగదు ఆధారిత వ్యవస్థగా మారే ప్రమాదం:
యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు అమలు చేస్తే ప్రజలు, దుకాణదారులు డిజిటల్ చెల్లింపులను పక్కనపెట్టి మళ్లీ నగదు వైపు మళ్లుతారని గ్రోవర్ హెచ్చరించారు. దీనివల్ల బ్యాంకులు, వాణిజ్య సంస్థలకు నగదు నిర్వహణ (Cash Handling) ఖర్చులు తడిసిమోపెడవుతాయని, చివరకు దేశం మళ్లీ నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మారే ప్రమాదం ఉందని తెలిపారు.
రూ.2,000 పరిమితిపై స్పష్టత కరువు:
ఇటీవల వెలువడిన నిబంధనల ప్రకారం.. రూ.2,000 వరకు యూపీఐ, రూపే డెబిట్ కార్డు లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించకూడదు. అయితే రూ.2,000 పైబడిన మర్చంట్ పేమెంట్స్‌పై ఛార్జీలు ఉంటాయా లేదా అనేదానిపై స్పష్టత లేదని ఆయన గుర్తుచేశారు. "పరిమాణం పరంగా రూ.2,000 కంటే ఎక్కువ విలువైన లావాదేవీలు కేవలం 4 శాతమే అయినా, మొత్తం యూపీఐ లావాదేవీల విలువలో వాటి వాటా ఏకంగా 66 శాతంగా ఉంది. వాటిపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధిస్తే ఆ భారాన్ని వ్యాపారులు వినియోగదారులపైనే మోపుతారు" అని వివరించారు.
నగదు అడిగే పరిస్థితి వస్తుంది:
అదనపు ఛార్జీల భారం పడకుండా ఉండేందుకు వినియోగదారులు రూ.12,000 చెల్లించాల్సిన చోట రూ.2,000 చొప్పున ఆరుసార్లు చెల్లించే అవకాశముందని, లేదంటే వ్యాపారులు రూ.2,000 కంటే ఎక్కువ యూపీఐ స్వీకరించకుండా నేరుగా నగదు అడుగుతారని చెప్పారు. దీంతో మళ్లీ ఏటీఎంలు, క్యాష్ సెంటర్ల అవసరం పెరుగుతుందన్నారు.
బ్యాంకులు వేల కోట్ల లాభాల్లో లేవా?
యూపీఐపై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహక సబ్సిడీని రద్దు చేయాలని చూడటం సరికాదని గ్రోవర్ స్పష్టం చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి ప్రభుత్వానికి రూ.2.87 లక్షల కోట్ల మిగులు బదిలీ అయిందని, దేశంలోని లిస్టెడ్ బ్యాంకుల మొత్తం లాభాలు రూ.4.11 లక్షల కోట్లుగా ఉన్నాయని గుర్తుచేశారు. అంతేకాకుండా ఎన్పీసీఐ (NPCI) పన్నుల పూర్వ లాభం కూడా రూ.1,888 కోట్లుగా ఉన్నప్పుడు, ప్రజలకు అందుబాటులో ఉన్న డిజిటల్ వ్యవస్థను ఎందుకు ఇబ్బందుల్లోకి నెడుతున్నారని ఆయన ప్రశ్నించారు.