16న మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా ప్రారంభం
16న మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా ప్రారంభం
ప్రభుత్వ బడికి అంతర్జాతీయ హంగులు.
రూ.8 కోట్లతో స్టోన్‌హౌస్‌పేట RSR ప్రభుత్వ హైస్కూల్ రూపురేఖల మార్పు
వి ఆర్ సి స్ఫూర్తి,మంత్రి నారాయణ చొరవతో వీ పి ఆర్ ఫౌండేషన్ ద్వారా ఎంపీ వేమిరెడ్డి దాతృత్వం
నెల్లూరు, మేజర్ న్యూస్: ప్రభుత్వ పాఠశాలంటే నాలుగు గోడలు,కొన్ని తరగతి గదులు అనే రోజులు పోయాయి. పేద విద్యార్థులకు సైతం కార్పొరేట్, అంతర్జాతీయ స్థాయి విద్యా వసతులు అందుబాటులోకి రావాలన్న లక్ష్యంతో నెల్లూరు సిటీలో సాగుతున్న విద్యాయజ్ఞం సత్ఫలితాలిస్తోంది. ఆ దిశగా స్టోన్‌హౌస్‌పేటలోని ఆర్ ఎస్ ఆర్ ప్రభుత్వ హైస్కూల్ సరికొత్త రూపాన్ని సంతరించుకుంటోంది. వి ఆర్ సి ప్రభుత్వ హైస్కూల్‌ను ఆధునిక ప్రమాణాలతో తీర్చిదిద్దిన స్ఫూర్తితో మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ చొరవతో వీ పి ఆర్ ఫౌండేషన్ ద్వారా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సుమారు రూ.8 కోట్లతోఆర్ ఎస్ ఆర్ పాఠశాల రూపురేఖలను పూర్తిగా మార్చేశారు.
43 తరగతి గదులతో విద్యా ప్రాంగణం: రెండంతస్తుల్లో భారీ నిర్మాణంతో 43 తరగతి గదులు సిద్ధమవుతున్నాయి. విద్యార్థులకు డిజిటల్ బోధన అందించేందుకు LED స్క్రీన్లు, అధునాతన బెంచీలను ఏర్పాటు చేస్తున్నారు.పాఠ్యపుస్తకాలకే విద్యను పరిమితం చేయకుండా ప్రయోగాత్మక, సాంకేతిక విద్యకు ప్రాధాన్యం ఇస్తూ కంప్యూటర్, రోబోటిక్స్, ఆస్ట్రో, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు.అలాగే విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఆర్ట్, మ్యూజిక్, డాన్స్, లాంగ్వేజ్ రూమ్‌లు తదితర ప్రత్యేక వసతులను కల్పిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ ఆధునిక టాయిలెట్లను ఏర్పాటు చేశారు.
ఎకరా స్థలంలో ఆటల ప్రపంచం: చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలన్న ఉద్దేశంతో పాఠశాలలో విశాలమైన క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఎకరా స్థలంలో ప్లేగ్రౌండ్ ఏర్పాటు చేయడంతో పాటు ఫుట్‌బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్ కోర్టులు సిద్ధం చేస్తున్నారు.అదనంగా కిడ్స్ ప్లే ఏరియా, సెన్సరీ పార్క్, అవుట్‌డోర్ జిమ్ వంటి సదుపాయాలను కల్పించారు. సుమారు 21 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సింథటిక్ కోర్టు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
నర్సరీ నుంచి పదో తరగతి వరకు: ఆర్ ఎస్ ఆర్ ప్రభుత్వ హైస్కూల్‌ను నర్సరీ నుంచి పదో తరగతి వరకు విద్యాబోధనకు అనువుగా తీర్చిదిద్దుతున్నారు. ఒకే ప్రాంగణంలో పాఠశాల విద్యకు అవసరమైన తరగతి గదులు, ల్యాబ్‌లు, గ్రంథాలయం, కళలు, క్రీడలు, డిజిటల్ విద్య తదితర సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని 15 వేల మంది నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఆస్తిగా అందించాలన్నది మంత్రి నారాయణ సంకల్పం.ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులు కూడా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులతో సమానంగా ఆధునిక సదుపాయాలను వినియోగించుకోవాలన్న లక్ష్యంతో మంత్రి నారాయణ ఈ విద్యాయజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.పేద పిల్లల భవిష్యత్తుకు నాణ్యమైన విద్యే నిజమైన ఆస్తి అనే ఆలోచనతో సాగుతున్న ఈ కార్యక్రమానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వంటి దాతలు ముందుకు రావటం అభినందనీయం.