ఉద్యోగాలు ఇచ్చే పారిశ్రామికవేత్తలుగా యూపీ యువత ఎదగాలి
సీఎం యోగి ఆదిత్యనాథ్
లక్నో: ఉత్తరప్రదేశ్ యువత కేవలం ఉద్యోగార్ధులుగా మిగిలిపోకుండా, ఇతరులకు ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు. సోమవారం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఇచ్చిన సందేశంలో.. యూపీ గుర్తింపు కేవలం మార్కెట్, మానవ వనరులపైనే కాకుండా ఇక్కడి యువత నైపుణ్యాలు, చేతివృత్తి నిపుణులు మరియు కళాకారుల ప్రతిభపై ఆధారపడి ఉందన్నారు.
ఈ సందర్భంగా గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో సెంటర్ అండ్ మార్ట్‌లో సెప్టెంబర్ 25 నుండి 29 వరకు 'యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో (UPITS 4.0)' నాలుగో ఎడిషన్‌ను నిర్వహిస్తున్నట్లు సీఎం తెలిపారు. 2023లో ప్రారంభమైన ఈ అంతర్జాతీయ వాణిజ్య మేళా.. యూపీ ఉత్పత్తులకు, కళాకారులకు మరియు రైతులకు ప్రపంచ స్థాయి వేదికను కల్పిస్తోందని పేర్కొన్నారు.
యువత, విద్యార్థులు మరియు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ వేదికను సద్వినియోగం చేసుకుని కొత్త వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. 'మేక్ ఇన్ ఇండియా', 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యాలకు అనుగుణంగా సాగుతున్న ఈ ప్రదర్శన ద్వారా స్థానిక ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లకు చేరుకుంటాయని, ఇదే పునాదిగా ఉత్తరప్రదేశ్‌ను 'వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ'గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.