వాతావరణ మార్పులపై పోరుకు ప్రజల భాగస్వామ్యం అవసరం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ:వాతావరణ మార్పులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సాంప్రదాయ జ్ఞానంతో కూడిన ప్రజల కేంద్రీకృత, సమాజ ఆధారిత విధానాలు అత్యంత ఆవశ్యకమని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) నిర్వహించిన ‘పర్యావరణం మరియు వాతావరణ గతిశీలత యొక్క భవిష్యత్తు’ అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో ఆదివారం ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
వాతావరణ మార్పులు ఆహార భద్రత, ఆరోగ్యం, జీవనోపాధితో పాటు జీవవైవిధ్య నష్టం, నీటి కొరత మరియు భూక్షయానికి దారితీస్తున్నాయని రాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాల ప్రభావానికి గురయ్యే గ్రామీణ ప్రాంతాలు, అటవీ సమాజాలు, చిన్న రైతులు మరియు మహిళల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక చట్రం రూపొందించాలని సూచించారు. కేవలం చెట్లను నాటడమే కాకుండా, స్వయం సమృద్ధి కలిగిన పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించేలా సుస్థిర అటవీకరణ జరగాలని ఉద్ఘాటించారు.
అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ ఆర్థిక ఆకాంక్షలు, అభివృద్ధి అవసరాలకు అనుగుణంగా వాతావరణ చర్యలను ప్లాన్ చేసుకోవాలని స్పష్టం చేశారు. భారతదేశం ప్రారంభించిన 'మిషన్ లైఫ్' కార్యక్రమం ప్రజా భాగస్వామ్యంతో పర్యావరణ పరిరక్షణ ఏ విధంగా సాధ్యమో చాటిచెబుతోందని ప్రశంసించారు. విభిన్న దేశాల న్యాయ నిపుణులు, పర్యావరణ వేత్తలను ఒకే వేదికపైకి తెచ్చి ఈ సదస్సును విజయవంతంగా నిర్వహించిన ఎన్‌జీటీని రాష్ట్రపతి ముర్ము అభినందించారు.