జైలు ఖైదీకి ప్రత్యేక గది.. అధికారిణిపై బదిలీ వేటు, అసలేం జరిగిందంటే?
న్యూస్ డెస్క్: జైలు అధికారిణిపై బదిలీ వేటు.. ఖైదీకి ప్రత్యేక సౌకర్యాల ఆరోపణలతో కీలక నిర్ణయం
కర్ణాటక: మండ్య జిల్లా జైలు సూపరింటెండెంట్ ఎం. శాంతమ్మపై బదిలీ వేటు పడింది. జైలులో ఉన్న ఓ విచారణ ఖైదీకి నిబంధనలకు విరుద్ధంగా సౌకర్యాలు కల్పించారనే ఆరోపణలు రావడంతో ఆమెను బళ్లారి సెంట్రల్ జైలుకు బదిలీ చేస్తూ జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
శ్రీరంగపట్నానికి చెందిన ప్రభుత్వ అధికారి మహమ్మద్ హుస్సేన్ ప్రస్తుతం ఫోర్జరీ కేసులో విచారణ ఖైదీగా ఉన్నారు. అయితే అనారోగ్యానికి సంబంధించిన స్పష్టమైన కారణాలు లేకపోయినా ఆయన మిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పేరుతో చేరినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఆసుపత్రిలోని ప్రత్యేక గదిలో ఓ మహిళతో ఆయన సన్నిహితంగా ఉన్న విషయం బయటకు రావడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు ఆసుపత్రిని పరిశీలించడంతో పాటు ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు.
ఇదే సమయంలో మండ్య జైలులో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఖైదీలు రాసినట్లుగా భావిస్తున్న ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. డబ్బులు చెల్లిస్తే కొందరు ఖైదీలకు ప్రత్యేక సదుపాయాలు, ఇతర ప్రయోజనాలు కల్పిస్తున్నారనే ఆరోపణలు అందులో ఉన్నట్లు సమాచారం.
ఈ పరిణామాల నేపథ్యంలో జిల్లా సెషన్స్ జడ్జి నేతృత్వంలోని బృందం ఆసుపత్రిని తనిఖీ చేసి సంబంధిత వ్యక్తులను విచారించింది. ఘటనపై ప్రాథమిక పరిశీలనలో జైలు అధికారుల పర్యవేక్షణలో లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో జైళ్ల చీఫ్ అలోక్ కుమార్.. మండ్య జైలు సూపరింటెండెంట్ ఎం. శాంతమ్మను బళ్లారి సెంట్రల్ జైలుకు బదిలీ చేశారు. ఆమె స్థానంలో ఫక్కీరప్ప బరకర్‌ను కొత్తగా నియమించారు.
జైలు నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘించకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన నేపథ్యంలో ఈ బదిలీ ఉత్తర్వులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.