శత్రు స్థావరాలపై దాడికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ
రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
న్యూఢిల్లీ: దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే శత్రువుల స్వదేశంలోకి వెళ్లే తగిన రీతిలో ప్రతిస్పందించేందుకు సాయుధ దళాలకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ, అవసరమైన వనరులను కల్పించిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, భారత్ ఎల్లప్పుడూ శాంతినే కోరుకుంటుందని, అయితే శాంతిని బలహీనతగా భావిస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలతో చర్చలకు తావులేదని, సైనిక చర్యల ద్వారానే సమాధానం ఇస్తామని హెచ్చరించారు. జమ్మూ కాశ్మీర్‌లో తీవ్రవాద నిర్మూలన, పునరావాస కార్యక్రమాల ద్వారా యువతను ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చామని, ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ అభివృద్ధి వేగవంతమైందని తెలిపారు. ఉగ్రవాద నిర్మూలనలో సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ వైమానిక దాడులు, ఆపరేషన్ సిందూర్‌లు భారత మారిన వ్యూహానికి నిదర్శనాలని పేర్కొన్నారు.
సాంకేతికత పెరిగిన నేటి కాలంలో భూమి, ఆకాశం, సముద్రంతో పాటు అంతరిక్షం, సైబర్‌స్పేస్‌లు కూడా కీలక రంగాలుగా మారాయని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. కృత్రిమ మేధ, డ్రోన్లు, ఖచ్చితత్వ ఆయుధాలతో భవిష్యత్ యుద్ధాలకు సన్నద్ధమయ్యేలా భారత రక్షణ విధానం ప్రతిచర్యాత్మక వైఖరి నుండి క్రియాశీలక వైఖరికి మారిందని వివరించారు.
గత 12 ఏళ్లలో భారత రక్షణ రంగం గణనీయమైన స్వయం సమృద్ధిని సాధించిందని మంత్రి గణాంకాలతో వెల్లడించారు. 12 ఏళ్ల క్రితం రూ. 2.5 లక్షల కోట్లుగా ఉన్న రక్షణ బడ్జెట్ ప్రస్తుతం దాదాపు రూ. 8 లక్షల కోట్లకు పెరిగిందని అన్నారు. 2014కు ముందు రూ. 40,000 కోట్లుగా ఉన్న రక్షణ ఉత్పత్తి ఇప్పుడు రూ. 1.80 లక్షల కోట్లకు చేరగా, రక్షణ ఎగుమతులు 56 రెట్లు పెరిగి రూ. 38,000 కోట్లకు పైగా నమోదయ్యాయని చెప్పారు. 2029 నాటికి రూ. 50,000 కోట్ల విలువైన రక్షణ పరికరాలను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
దేశంలోని 16 రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాలు లేకుండా పనిచేస్తున్నాయని, 16,000కు పైగా ఎంఎస్‌ఎంఈలు, 2,000కు పైగా స్టార్టప్‌లు రక్షణ రంగంలో నిమగ్నమయ్యాయని మంత్రి పేర్కొన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐఎన్ఎస్ విక్రాంత్, ఆకాశ్, అస్త్ర క్షిపణులు, తేజస్, ప్రచండ్, ధ్రువ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లను ప్రశంసిస్తూ, ప్రస్తుతం భారత్ ఆరో తరం యుద్ధ విమానాల అభివృద్ధిపై దృష్టి సారించిందని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.