77 మంది ఇషా యాత్రికుల ఆచూకీ గల్లంతు– సద్గురు
కాఠ్‌మాండ్: చైనాలోని టిబెట్ పరిధిలో ఉన్న గిరాంగ్ పట్టణాన్ని ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో 77 మంది ఇషా ఫౌండేషన్ యాత్రికుల ఆచూకీ తెలియకుండా పోయిందని ఆధ్యాత్మిక గురువు సద్గురు వెల్లడించారు. పవిత్ర కైలాస మానస సరోవర యాత్రను ముగించుకుని తిరిగొస్తున్న పలు బృందాలకు చెందిన ఈ యాత్రికులు, నేపాల్-టిబెట్ సరిహద్దులోని గిరాంగ్ ఇమ్మిగ్రేషన్ కార్యాలయంలో బస చేసిన సమయంలో ఈ దారుణ విపత్తు సంభవించింది.
ఈ భయంకరమైన ఘటనపై 'X' (ట్విట్టర్) వేదికగా స్పందించిన సద్గురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. విరుచుకుపడిన భారీ నీటి ప్రవాహానికి ఇమ్మిగ్రేషన్ కార్యాలయ భవనం పూర్తిగా మునిగిపోయిందని, సరిహద్దు పట్టణమంతా జలమయమైందని తెలిపారు. ప్రస్తుతం ఆ కార్యాలయంలో ఉన్న వారి సమాచారం ఏదీ అందుబాటులో లేదని ఆయన పేర్కొన్నారు.
వాలంటీర్లు, సహాయక బృందాలు తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నప్పటికీ, స్థానిక అధికారులతో కలిసి గాలింపు మరియు రెస్క్యూ ఆపరేషన్లలో సహాయపడేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని సద్గురు స్పష్టం చేశారు.