క్రీడలతో మానసిక ఉల్లాసం.. శారీరక దారుఢ్యం
క్రీడలతో మానసిక ఉల్లాసం.. శారీరక దారుఢ్యం
జాతీయ క్రీడా దినోత్సవంలో అడిషనల్ కలెక్టర్ పాండు
సంగారెడ్డి, మేజర్ న్యూస్ ప్రతినిధి....క్రీడలు విద్యార్థులకు కేవలం వినోదం మాత్రమే కాదని, వాటి ద్వారా మానసిక ఆరోగ్యం, ఉల్లాసం, ఆహ్లాదంతో పాటు శారీరక శక్తి, దారుఢ్యం పెంపొందుతాయని సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ శ్రీ పాండు అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లా యువజన మరియు క్రీడల కార్యాలయం ఆధ్వర్యంలో సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో శుక్రవారం మేజర్ ధ్యాన్ చంద్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ కలెక్టర్ పాండు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని తెలిపారు. ప్రతి విద్యార్థి తనకు నచ్చిన క్రీడను ఎంచుకుని నిరంతరం సాధన చేస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని అన్నారు.హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్ సేవలు చిరస్మరణీయం
కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న నేషనల్ ప్లేయర్ మహమ్మద్ జావిద్ ఆలీ మాట్లాడుతూ మేజర్ ధ్యాన్ చంద్ క్రీడా ప్రతిభను, హాకీ రంగంలో ఆయన సాధించిన ఘనతలను వివరించారు. భారతదేశానికి హాకీలో అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు తీసుకురావడంలో ధ్యాన్ చంద్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆయన క్రీడా జీవితం నేటి యువతకు, క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.
గౌరవ అతిథి కూన వేణు మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో ప్రతిభను చాటుకుని ధ్యాన్ చంద్ స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. క్రీడల్లో రాణించి భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకు సన్మానంఈ సందర్భంగా ఖేలో ఇండియాలో జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన కొర్రరాజు, జాడో చరణ్, కె. గీతలను ఘనంగా సన్మానించారు. వారి విజయాలను అభినందిస్తూ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను సత్కరించడం ద్వారా ఇతర విద్యార్థుల్లోనూ క్రీడలపై ఆసక్తి, స్ఫూర్తి పెరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ హాకీ కోచ్ సాయికుమార్, సహాయ సాంఘిక సంక్షేమ అధికారి బి. శంకర్, రెజ్లింగ్ కోచ్ జైపాల్, వ్యాయామ ఉపాధ్యాయులు దుర్గ ప్రసాద్, సుభాష్ గౌడ్, రామకృష్ణ, రామ గౌడ్, కృష్ణయ్య, SGF సెక్రెటరీ శ్రీనివాస్, కరాటే అసోసియేషన్ ప్రతినిధి చవాన్ చందర్, బాక్సింగ్ అసోసియేషన్ ప్రతినిధి మహేష్, రెజ్లింగ్ అసోసియేషన్ ప్రతినిధి విట్టల్ నాయక్ తదితరులు, క్రీడాకారులు, విద్యార్థులు, జిల్లా యువజన మరియు క్రీడల శాఖ సిబ్బంది పాల్గొన్నారు.