డంప్‌యార్డ్‌ను వెంటనే తరలించాలి
కరీంనగర్: నగర ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా కరీంనగర్ డంప్‌యార్డ్‌ను వెంటనే నగరానికి దూరంగా తరలించాలని తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం కరీంనగర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ డంప్‌యార్డ్‌లో భారీగా చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన, పొగ, దోమలు, కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పేరుకుపోయిన చెత్తను బయోమైనింగ్ ద్వారా శాస్త్రీయ పద్ధతిలో తొలగించి, తడి–పొడి చెత్తను వేరు చేసి శాశ్వత వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను అమలు చేయాలని డిమాండ్ చేశారు. డంప్‌యార్డ్ తరలింపుపై ప్రభుత్వం చర్యలను వేగవంతం చేయాలని, లేనిపక్షంలో ప్రజల కోసం మరిన్ని పోరాటాలు చేపడతామని హెచ్చరించారు.
కార్యక్రమంలో లింగంపల్లి నాగరాజు, మేకల తిరుపతి, చెన్నమల్ల చైతన్య, శ్రీరాముల రమేష్, కుతాడి శ్రీనివాస్, రంగరవేణి లక్ష్మణ్, బాసవేణి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.