J అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
పత్రికా ప్రకటన
తేది: 29-08-2026
మహబూబ్‌నగర్
*జడ్చర్ల మున్సిపాలిటీ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్*
జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న వివిధ అభివృద్ధి, పారిశుద్ధ్య, పౌర సేవల కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు.
శనివారం అదనపు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలోని తన ఛాంబర్‌లో జడ్చర్ల మున్సిపాలిటీకి చెందిన అధికారులు, సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలోని వివిధ విభాగాల పనితీరు, ఆయా విభాగాల ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాల పురోగతిని విభాగాల వారీగా సమీక్షించారు.
మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల స్థితిగతులు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత నిర్వహణ, ప్రజలకు అందుతున్న మున్సిపల్ సేవలు, పన్నులు తదితర ఆదాయ వసూళ్ల పురోగతి, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, పట్టణ అభివృద్ధి కార్యక్రమాలు తదితర అంశాలపై అదనపు కలెక్టర్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రజలకు మున్సిపల్ సేవలు ఎలాంటి జాప్యం లేకుండా అందేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పట్టణంలో పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ నిరంతరం పర్యవేక్షించాలని, ప్రజల నుంచి అందే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.
అదేవిధంగా మున్సిపాలిటీ ఆదాయ వనరులను పెంపొందించడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న పన్నులు, ఇతర ఆదాయ బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇప్పటికే ప్రారంభమైన అభివృద్ధి పనులను నిర్దేశిత ప్రమాణాలతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ప్రతి విభాగం తనకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, మున్సిపాలిటీ అభివృద్ధి , ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో కీలకపాత్ర పోషించాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ సూచించారు.