రసాయన శాస్త్రంలో కిరణ్ కుమార్ కు పీహెచ్.డీ....
పటాన్ చెరు మేజర్ న్యూస్..హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి వున్నం కిరణ్ కుమార్ డాక్టరేట్ కు అర్హత సాధించారు. ఫాస్పేట్, 2,4-థియాజోలిడిన్ డయోన్ ఉత్పన్నాల సంశ్లేషణ, వాటి జీవక్రియాశీలతల పరిశీలన, ఫావిపిరావిర్ తయారీ విధాన అభివృద్ధి’ చేసి, ఆయన సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కనకదుర్గా భాస్కర్ యమాజాల శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.డాక్టర్ కిరణ్ కుమార్ పరిశోధన, గణనీయమైన చికిత్సా సామర్థ్యం కలిగిన నూతన హెటెరోసైక్లిక్ సమ్మేళనాల రూపకల్పన, సంశ్లేషణ, జీవ మూల్యాంకనంపై దృష్టి సారించినట్టు తెలియజేశారు. ఈ అధ్యయనం యాంటీవైరల్ ఔషధం ఫావిపిరవిర్ కోసం ఒక మెరుగైన, విస్తరించదగిన సంశ్లేషణ ప్రక్రియను అభివృద్ధి చేయడంతో పాటు, యాంటీ బాక్టీరియల్, యాంటీ డయాబెటిక్, యాంటీ క్యాన్సర్ కార్యకలాపాలు కలిగిన ఆశాజనకమైన (ఎస్)-బినోల్ ఫాస్ఫేట్, 2.4-థయాజోలిడిన్ డయోన్ ఉత్పన్నాలను గుర్తించిందన్నారు. ఈ పరిశోధన పారిశ్రామిక అనువర్తనాలకు సంభావ్యత ఉన్న ఆచరణాత్మక సంశ్లేషణ పద్ధతులను అందిస్తుందని, భవిష్యత్తు ఔషధ అభివృద్ధి, ప్రీ-క్లినికల్ పరిశోధనలకు బలమైన పునాది వేస్తుందని తెలిపారు.డాక్టర్ కిరణ్ కుమార్ సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డి.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ డైరెక్టర్ డాక్టర్ ఎం.రెజా, రసాయ శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ గౌసియా బేగం, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందించడమే గాక, ఔషధ రసాయన శాస్త్ర పరిశోధనకు ఆయన చేసిన విలువైన కృషిని ప్రశంసినట్టు వివరించారు. డాక్టరేట్ పరిశోధన అంతటా అంకితభావంతో మార్గనిర్దేశనం చేయడంతో పాటు సలహాలు అందించినందుకు డాక్టర్ కనక దుర్గా భాస్కర్ యమాజాలను కూడా అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.