నిధుల కొరతతో ముడుచింతలపల్లి మున్సిపాలిటీ లో అయోమయం..!
అభివృద్ధి పనులకు నిధులు ఎక్కడ? దిక్కుతోచని స్థితిలో కౌన్సిలర్లు.. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎదురుచూపులు
శామీర్ పేట, మేజర్ న్యూస్ :
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లో నూతనంగా ఏర్పడిన మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో నిధుల కొరత కారణంగా అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదనే ఆందోళన వ్యక్తమవుతోంది. మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, రహదారులు, డ్రైనేజీ తదితర సమస్యల పరిష్కారానికి నిధులు అందుబాటులో లేకపోవడంతో కౌన్సిలర్లు అయోమయానికి గురవుతున్నారని తెలుస్తోంది.
తమ వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ, వాటి పరిష్కారానికి అవసరమైన నిధులు లేకపోవడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారిందని కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త మున్సిపాలిటీగా ఏర్పడిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులకు ఊతమివ్వాలని వారు కోరుతున్నారు.
ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తమపై ఉండగా, నిధుల లభ్యత లేకపోవడం వల్ల పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొందని పలువురు కౌన్సిలర్లు పేర్కొంటున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి మున్సిపాలిటీకి తగిన నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులకు మార్గం సుగమం చేయాలని ప్రజలు కోరుతున్నారు.