జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనే నానుడి ఎలా వచ్చింది.. ఆగస్త్య మహర్షి పౌరాణిక గాథ వెనుక ఉన్న ఆసక్తికర విశేషాలు
సూర్య ఆధ్యాత్మిక డెస్క్: మన ఇళ్లలో చిన్న పిల్లలకు కడుపునిండా అన్నం తినిపించిన తర్వాత తల్లులు, పెద్దలు వారి పొట్టపై ఆప్యాయంగా నిమురుతూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనడం తరతరాలుగా వస్తున్న ఒక మధురమైన సాంప్రదాయం. పిల్లలు తిన్న ఆహారం సులభంగా అరిగిపోయి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించే ఈ నానుడి వెనుక మత్స్య పురాణంతో పాటు పలు ప్రాచీన గ్రంథాలలో ప్రస్తావించిన ఒక అద్భుతమైన పౌరాణిక ఘట్టం దాగి ఉంది. పూర్వం దండకారణ్యంలో వాతాపి, ఇల్వలుడు అనే ఇద్దరు కామరూప రాక్షస సోదరులు ఉండేవారు. వారు సాధువులు, బ్రాహ్మణుల వేషాలు ధరించి ఆ అరణ్య మార్గంలో వెళ్లే బాటసారులను, ఋషులను తమ ఇంటికి పితృకార్యమైన ఆబ్దిక భోక్తగా రమ్మని ఆహ్వానించేవారు. పూర్వ యుగాల్లో ఆబ్దికంలో మాంసాహార నివేదన శాస్త్రసమ్మతంగా ఉండేది కాబట్టి, వాతాపి మేక రూపంలోకి మారగా ఇల్వలుడు వంట చేసి అతిథులకు వడ్డించేవాడు. భోజనం ముగియగానే ఇల్వలుడు వాతాపి బయటకు రా అని పిలవగానే, ఆ రాక్షసుడు వారి పొట్టలను చీల్చుకుంటూ బయటకు వచ్చి వారిని సంహరించి వారి సంపదలను దోచుకునేవారు.
ఈ క్రమంలో లోకోద్ధారకుడైన అగస్త్య మహర్షి ఒకసారి స్నానానికి వెళ్లినప్పుడు లోయలో ఒక గడ్డిపరకకు తలకిందులుగా వేలాడుతున్న తన పితృదేవతలను చూసి ఆశ్చర్యపోయారు. తమ వంశంలో జన్మించిన అగస్త్యుడు వివాహం చేసుకోకుండా తపస్సులో మునిగిపోవడం వల్ల తమకు ఉత్తమ గతులు కలగడం లేదని పితృదేవతలు వేదన చెందడంతో, మహర్షి గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. తనకు తగిన సద్గుణవతి అయిన విదర్భ రాజకుమారి లోపాముద్రను వివాహం చేసుకోవాలని భావించి విదర్భ రాజును సంప్రదించారు. అయితే రాజసౌధాల్లో పెరిగిన తన కుమార్తెకు ఎలాంటి లోటు లేకుండా చూసుకోగలననే నమ్మకం కలిగించేంత అపార సంపదను సమకూర్చాలని విదర్భ రాజు ఒక కఠినమైన షరతు విధించారు. లోక కళ్యాణం కోసం తన దివ్య తపోశక్తితో కాకుండా ధర్మబద్ధంగా నిధులు సమకూర్చుకోవాలని భావించిన అగస్త్యుడికి, దండకారణ్యంలో వాతాపి మరియు ఇల్వలుల రాక్షస దురాగతాల గురించి ఇతర ఋషులు వివరించి వారి పీడ విరగడ చేయాలని వేడుకున్నారు.
సాధువుల వినతి మేరకు అగస్త్య మహర్షి దండకారణ్యానికి చేరుకోగా, ఎప్పటిలాగే వాతాపి, ఇల్వలులు ఆయనను ఆబ్దిక భోజనానికి ఆహ్వానించారు. వాతాపిని మాంసంగా వండి వడ్డించగా, అగస్త్య మహర్షి ఆ భోజనాన్ని నిశ్చింతగా ఆరగించారు. భోజనం ముగిసిన వెంటనే తన దివ్య తపోశక్తితో పొట్టపై చేయి వేసి నిమురుతూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని ఉచ్ఛరించారు. దాంతో మహర్షి జఠరాగ్ని ప్రభావంతో కడుపులో ఉన్న వాతాపి రాక్షసుడు పూర్తిగా భస్మమై జీర్ణమైపోయాడు. ఆ విషయం తెలియని ఇల్వలుడు ఎప్పటిలాగే వాతాపి బయటకు రా అని బిగ్గరగా కేక వేయగా, నీ సోదరుడు ఎప్పటికీ రాడు, నా కడుపులో జీర్ణమైపోయాడని అగస్త్యుడు శాంతంగా చెప్పారు. తమ్ముడి మరణంతో ఆగ్రహోదగ్రుడైన ఇల్వలుడు రాక్షస రూపం దాల్చి మహర్షిపై దాడికి దిగగా, అగస్త్యుడు ఒక్క హుంకారంతో ఆ దుష్ట రాక్షసుడిని మాడ్చి బూడిద చేశారు.
దుష్ట రాక్షసుల సంహారం అనంతరం వారు అన్యాయంగా కూడబెట్టిన అపార ధనరాశులను అగస్త్య మహర్షి స్వాధీనం చేసుకున్నారు. ఆ సంపదను విదర్భ రాజుకు సమర్పించగా, లోపాముద్రతో అగస్త్యుడి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అలా రాక్షస సంహారంతో లోక కళ్యాణం జరగడంతో పాటు మహర్షి వివాహం కూడా దిగ్విజయంగా పూర్తయింది. పరమ భయంకరమైన రాక్షసుడినే తన జీర్ణశక్తితో కరిగించివేసిన అగస్త్య మహర్షి గాథను స్మరిస్తూ, చిన్నారులు తీసుకున్న ఆహారం అమృతంలా ఒంటబట్టాలనే సదుద్దేశంతో నేటికీ తల్లులు పిల్లల పొట్టపై నిమురుతూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని పలకడం సనాతన సంస్కృతిలో ఒక అపురూపమైన ఆచారంగా నిలిచిపోయింది.