OCA డైరెక్టర్ జనరల్‌తో క్రీడల మంత్రి మన్సుఖ్ మండావియా భేటీ
నగోయా (జపాన్): 20వ ఆసియా క్రీడల సందర్భంగా జపాన్‌లోని నగోయా నగరంలో పర్యటిస్తున్న కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మండావియా, ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (OCA) డైరెక్టర్ జనరల్ మరియు వరల్డ్ ఆక్వాటిక్స్ ప్రెసిడెంట్ కెప్టెన్ హుస్సేన్ అల్-ముసల్లంతో శనివారం భేటీ అయ్యారు. భారతదేశానికి, ఆసియా క్రీడా సమాజానికి మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై వీరిద్దరూ సుదీర్ఘంగా చర్చించారు.
భారత జాతీయ క్రీడా సమాఖ్యలు, ఆసియా క్రీడా సమాఖ్యల మధ్య సమన్వయాన్ని పెంచడంతో పాటు దేశంలో జల క్రీడలను (ఆక్వాటిక్స్) ప్రాథమిక స్థాయి నుంచి అభివృద్ధి చేయడంపై ప్రధానంగా దృష్టి సారించినట్లు మండావియా తెలిపారు. వివిధ ఆసియా స్థాయి ఛాంపియన్‌షిప్‌లకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉండటాన్ని ఓసీఏ హర్షించింది. అనంతరం, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) అధ్యక్షురాలు పి.టి. ఉషతో కలిసి మంత్రి మండావియా ఆసియా క్రీడల అధికారిక స్వాగత సత్కారానికి హాజరై, జపనీస్ సాంప్రదాయ కార్యక్రమం 'కగామి-బిరాకి'లో పాల్గొన్నారు.
మరోవైపు, 20వ ఆసియా క్రీడలకు ముందు నగోయాలో జరిగిన 110వ ఓసీఏ కార్యనిర్వాహక మండలి సమావేశానికి ఓసీఏ అధ్యక్షుడు షేక్ జోవాన్ బిన్ హమద్ అల్ థానీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో రాబోయే ఆసియా ఇండోర్ మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ (రియాద్ 2026), బీచ్ గేమ్స్ (సెబు 2028), వింటర్ గేమ్స్ (అల్మాటీ 2029) సన్నాహాలను సమీక్షించారు. కాగా, ఐచి-నగోయా 2026 ఆసియా క్రీడలు శనివారం పలోమా మిజుహో స్టేడియంలో వేడుకగా ప్రారంభం కానున్నాయి.