జలధార-జలహారతి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి- కలెక్టర్ రాజకుమారి గణియా
-ఎల్‌నినో ప్రభావంతో ఉపాధి శ్రామికులకు విస్తృతంగా పనులు కల్పించాలి
నంద్యాల అర్బన్: జిల్లా లో జలధార-జలహారతి పథకం కింద చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు, ఎల్‌నినో ప్రభావంతో ఉపాధి హామీ శ్రామికులకు విస్తృతంగా పనులు కల్పించి వేజ్ కాంపోనెంట్‌ను పెంచేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఎంపీడీఓలను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జలధార-జలహారతి పథకం కింద జిల్లాలో గుర్తించిన 1,084 పనుల్లో 1,005 పనులకు ఇప్పటికే మంజూరులు జారీ చేశామని తెలిపారు. ఇప్పటివరకు జియోట్యాగింగ్ ద్వారా 337 పనులు పూర్తయ్యాయని, మిగిలిన 688 పనులను కూడా వేగవంతంగా పూర్తి చేసి లక్ష్యాలను సాధించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వీబీజీ రాంజీ పథకం కింద ఉపాధి శ్రామికులకు పెద్దఎత్తున పనులు కల్పించాలని కలెక్టర్ సూచించారు. లేబర్ మొబిలైజేషన్‌ను పెంచి, శ్రామికులకు ఎక్కువ పని దినాలు కల్పించడం ద్వారా వేజ్ కాంపోనెంట్‌ను పెంచేలా చర్యలు తీసుకోవాలని, మండలాల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని స్పష్టం చేశారు. అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పోర్టల్, యాప్‌లలో సకాలంలో నమోదు చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 46,700కు పైగా బయోమెట్రిక్ ఆధార్ అప్‌డేషన్ కేసులను 100 శాతం పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందుకోసం అందుబాటులో ఉన్న 83 కిట్లను పూర్తిస్థాయిలో వినియోగించుకుని, నాలుగు వారాల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు సమన్వయంతో క్యాంపులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.