మహిళా రిజర్వేషన్ల క్రెడిట్ ప్రధాని మోదీదే
రాహుల్ గాంధీకి నిజాయితీ ఉంటే మద్దతు ఇవ్వాలి
ఢిల్లీ హజ్ కమిటీ చైర్‌పర్సన్ కౌసర్ జహాన్
న్యూఢిల్లీ: పూణెలో నిర్వహించిన 'ఛాత్రో కి గూంజ్' (విద్యార్థుల గళం) కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ రాష్ట్ర హజ్ కమిటీ చైర్‌పర్సన్ కౌసర్ జహాన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వేదికలపై మహిళల హక్కులు, సాధికారత గురించి మాట్లాడే రాహుల్ గాంధీ, ఆచరణకు వచ్చేసరికి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ స్వప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తోందని ఆమె ఆరోపించారు. మహిళా సాధికారతకు సంబంధించిన ప్రతిపాదనలను వ్యతిరేకించడం ద్వారా రాహుల్ గాంధీ తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారని పేర్కొన్నారు.
ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు సిద్ధం
రాహుల్ గాంధీకి మహిళా సాధికారతపై నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేయాలని కౌసర్ జహాన్ సవాల్ విసిరారు. మహిళా రిజర్వేషన్ల ఘనత అందరికీ దక్కుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రకటించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఒకవేళ రాహుల్ గాంధీ ఈ బిల్లుకు పూర్తి మద్దతు తెలియజేస్తే, కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేసి, రాబోయే 2029 ఎన్నికల నాటికి ఈ రిజర్వేషన్లను అమలు చేసే అవకాశం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.