ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ
బెంగళూరు: తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో బెంగళూరులో ఆదివారం భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటుచేసుకున్న అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది.
తన కుమార్తె వ్యాఖ్యలు, తనపై వస్తున్న విమర్శలపై ఖర్గేకు కొండా సురేఖ వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకిగానీ, గాంధీ కుటుంబానికిగానీ వ్యతిరేకంగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, కావాలనే తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని వెల్లడించినట్లు సమాచారం.
పార్టీలోని అంతర్గత విషయాలు, విభేదాలు ఏవైనా ఉంటే ముందుగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం (పీసీసీ) దృష్టికి తీసుకెళ్లాలని, విభేదాలు వీడి సమన్వయంతో ముందుకు సాగాలని మంత్రి కొండా సురేఖకు ఈ సందర్భంగా ఖర్గే సూచించినట్లు తెలిసింది. ఈ భేటీ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది.