'వందేమాతరం' ఆచారంపై శశి థరూర్ స్పష్టత
1937 నాటి సంప్రదాయమే కాంగ్రెస్ విధానం
తిరువనంతపురం: జాతీయ గేయం 'వందేమాతరం' ఆలపించడంపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ శశి థరూర్ స్పష్టం చేశారు. పార్టీ కార్యక్రమాల్లో కాంగ్రెస్ ఏనాడో ఏర్పరుచుకున్న సంప్రదాయాన్నే ఇప్పటికీ కొనసాగిస్తోందని తెలిపారు.
ప్రభుత్వ లేదా జాతీయ వేడుకలకు, పార్టీ అంతర్గత కార్యక్రమాలకు స్పష్టమైన తేడా ఉందని శశి థరూర్ పేర్కొన్నారు.
ప్రభుత్వం లేదా అధికారిక వేదికలపై జాతీయ గేయం వాయిస్తున్నప్పుడు గౌరవసూచకంగా లేచి నిలబడటం తామందరి బాధ్యత అని పునరుద్ఘాటించారు.
కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశాల విషయానికొస్తే.. 1937 నుంచి వస్తున్న ఆచారాన్నే పాటిస్తున్నామని చెప్పారు. జాతీయ గీతంలోని ఒక చరణం, అలాగే వందేమాతరంలోని రెండు చరణాలను మాత్రమే ఆలపించడం సుదీర్ఘకాలంగా వస్తున్న విధానమని వివరించారు. ఈ విషయంలో పార్టీ అనుసరిస్తున్న తీరు అత్యంత స్పష్టంగా ఉందని, అనవసర వివాదాలకు తావులేదని థరూర్ వ్యాఖ్యానించారు.
