'స్పెషల్ క్యాంపెయిన్ 3'...పెండింగ్‌లో ఉన్న 2,306 పెన్షన్ ఫిర్యాదుల పరిష్కారం
న్యూఢిల్లీ:పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ (DoPPW) నిర్వహించిన 'స్పెషల్ క్యాంపెయిన్ 3' ద్వారా పెండింగ్‌లో ఉన్న 2,306 పెన్షన్ ఫిర్యాదులు, క్లెయిమ్‌లు విజయవంతంగా పరిష్కారమయ్యాయి. జూలై 7 నుండి ఆగస్టు 31 వరకు జరిగిన ఈ ప్రచారంలో ఏకంగా 72 శాతం పరిష్కార రేటు నమోదైందని ప్రభుత్వం వెల్లడించింది.
CPENGRAMS పోర్టల్ ద్వారా అందిన 3,193 కేసుల్లో 2,306 ఫిర్యాదులకు నాణ్యమైన పరిష్కారం లభించింది. DoPPW పర్యవేక్షణలో దాదాపు 40 కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు సమన్వయంతో పనిచేసి కేసులను పరిష్కరించాయి. పరిష్కారమైన కేసుల్లో అత్యధికం గ్రామీణ ప్రాంతాలకు చెందిన పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు సంబంధించినవే కావడం విశేషం.
లక్షల కొద్దీ బకాయిల విడుదల (కీలక కేసులు)..ఈ ప్రత్యేక ప్రచారంతో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రక్షణ శాఖ పెన్షనర్లకు భారీగా బకాయిలు అందాయి. అంగూరి దేవి ప్రత్యేక కుటుంబ పెన్షన్ వ్యత్యాస బకాయిల కింద 1996 నుండి వర్తించేలా రూ. 37.40 లక్షలు విడుదలయ్యాయి.
ఇదాన్ సింగ్ వైకల్య పెన్షన్ బకాయిలుగా రూ. 30 లక్షలు అందాయి.
కొరంగ లక్ష్మి కుటుంబ పెన్షన్ బకాయిల రూపంలో రూ. 30.15 లక్షలు చెల్లించారు.
కపూర్ సింగ్ యుద్ధ గాయాల పెన్షన్ (War injury element) కింద రూ. 26.12 లక్షలు అందాయి.
సరన్‌జిత్ కౌర్ ప్రత్యేక కుటుంబ పెన్షన్, ఎక్స్-గ్రేషియా బకాయిలతో కలిపి రూ. 31.17 లక్షలు పొందారు.
జయలక్ష్మి కర్ణన్ దివ్యాంగురాలైన పెన్షనర్ కుమార్తెకు 2013 నుండి వర్తించేలా రూ. 16.70 లక్షలు చెల్లించారు.
CPENGRAMS ఆన్‌లైన్ పోర్టల్ వినియోగం పెరగడం వల్ల డిజిటల్ అంతరం తగ్గి, సకాలంలో న్యాయం జరుగుతోందని సంక్షేమ శాఖ స్పష్టం చేసింది.