ఉపాధ్యాయుల కోసం ప్రహ్లాద్ జోషి బ్రిడ్జ్ కోర్సు ప్రారంభం
న్యూఢిల్లీ:ప్రాథమిక పాఠశాలల్లో బి.ఎడ్. విద్యార్హత కలిగిన ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు 'ప్రైమరీ టీచర్ ఎడ్యుకేషన్ (PTE)' ఆరు నెలల సర్టిఫికేట్ (బ్రిడ్జ్) కోర్సును కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS) ద్వారా అందించే ఈ కోర్సు, 1 నుండి 5వ తరగతి విద్యార్థులకు సమ్మిళిత, బాలల కేంద్రీకృత విధానంలో బోధించేలా శిక్షణనిస్తుందని పత్రికా ప్రకటనలో తెలిపారు.
నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) నిబంధనలకు అనుగుణంగా రూపొందించిన ఈ కోర్సును ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ (ODL) పద్ధతిలో నిర్వహిస్తారు. ఇందులో ఆరు సిద్ధాంత కోర్సులు, ఆన్‌లైన్ తరగతులు, 20 రోజుల పాఠశాల ఆధారిత ప్రాక్టికల్స్ ఉంటాయి. ఈ కోర్సులో చేరేందుకు ఎన్‌ఐఓఎస్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవచ్చని, బోధనా మాధ్యమం హిందీ, ఇంగ్లీషుల్లో ఉన్నప్పటికీ రాజ్యాంగంలోని 22 భాషల్లో దేనిలోనైనా పరీక్షలు రాసే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు.