ఉక్రెయిన్ శాంతి ప్రయత్నాల్లో భారత్ పాత్ర కీలకం
బెల్జియం రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్
న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే శాంతి ప్రయత్నాలలో భారతదేశం మరింత కీలక పాత్ర పోషించడాన్ని స్వాగతిస్తున్నామని బెల్జియం రక్షణ, వాణిజ్య మంత్రి థియో ఫ్రాంకెన్ తెలిపారు. అమెరికా నేతృత్వంలోని శాంతి చర్చలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదని, ఈ పరిస్థితుల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ చొరవ చూపడం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.
రాబోయే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ న్యూఢిల్లీకి రానున్నారని, ఈ సందర్భంగా శాంతి ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధాని మోదీకి గొప్ప అవకాశం లభిస్తుందని ఫ్రాంకెన్ 'X' (ట్విట్టర్) వేదికగా తెలిపారు.
న్యూఢిల్లీలో ప్రధాని మోదీ, బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్‌ల మధ్య జరిగిన చర్చల్లో ఉక్రెయిన్‌లో తక్షణమే కాల్పుల విరమణ జరగాల్సిన అవసరాన్ని ఉభయ దేశాలు నొక్కిచెప్పాయి. దౌత్య మార్గాల్లో శాంతిని సాధించేందుకు మద్దతు పునరుద్ఘాటించాయి.
భారత్-బెల్జియం ఆర్థిక బంధం వేగంగా విస్తరిస్తోందని ఫ్రాంకెన్ అన్నారు. బెల్జియం ప్రస్తుతం భారత్‌కు 5 బిలియన్ యూరోల విలువైన ఎగుమతులు చేస్తోందని, 2032 నాటికి దీన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. భారత్‌లో 140 కోట్ల మందితో భారీ మార్కెట్ ఉందన్న ఆయన, ఈ ఏడాది చివర్లో బ్రస్సెల్స్‌లో జరగబోయే సమగ్ర ఈయూ-భారత్ (EU-India) వాణిజ్య ఒప్పందంపై ప్రధాని మోదీ సంతకం చేయనున్నట్లు వెల్లడించారు.
తమ భారత, జపాన్ పర్యటనలు అత్యంత ఫలప్రదంగా ముగిశాయని, ద్వైపాక్షిక, రాజకీయ, ఆర్థిక బంధాలు మరింత పటిష్టమయ్యాయని థియో ఫ్రాంకెన్ సంతోషం వ్యక్తం చేశారు.