మాధురి రాథోడ్ కేసులో కీలక పరిణామం.. ఈశ్వర్ సాయికి ముందస్తు బెయిల్ మంజూరు!
సూర్య ఆధ్యాత్మిక డెస్క్:
సంచలనం సృష్టించిన మాధురి రాథోడ్ కేసులో నిందితుడిగా ఉన్న ఈశ్వర్ సాయికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇరువైపుల లాయర్ల వాదనలు విన్న న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన మాధురి రాథోడ్ ఉదంతంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి నిందితుడైన ఈశ్వర్ సాయికి తెలంగాణ హైకోర్టు ఊరటనిస్తూ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ మాధురి రాథోడ్ నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోరుతూ ఈశ్వర్ సాయి తరఫు న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో జరిగిన వాదనల సందర్భంగా, పిటిషనర్ తరఫు లాయర్ కీలక వాదనలు వినిపించారు. వివాహం చేసుకుంటానని మోసం చేశారన్న ఆరోపణలు నిరాధారమని, ఇప్పటికే పెళ్లైన వ్యక్తితో ఆమె సంబంధం కొనసాగించిందని, కేవలం సానుభూతి (సింపతీ) కోసం మాత్రమే ఈ తప్పుడు కేసు నమోదు చేశారని న్యాయస్థానానికి వివరించారు.
ఇరువర్గాల లాయర్లు సమర్పించిన వాదనలు, సాక్ష్యాధారాలను పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం ఈశ్వర్ సాయికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో తదుపరి విచారణ మరియు పోలీసుల దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.