గణేశ్ నిమజ్జనోత్సవాలను ప్రశాంతంగా జరుపుకుందాం..
ఏర్పాట్లపై పోలీసులు, మున్సిపల్ అధికారులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ సమీక్ష…
మేయర్, డిప్యూటీ మేయర్ హాజరు…
పలు గణేశ్ మండపాలను సందర్శించిన కేంద్ర మంత్రి…
సూర్య కరీంనగర్ ప్రతినిధి::
కరీంనగర్ లో గణేశ్ నిమజ్జన ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అధిక బడ్జెట్ కేటాయించామని, నగరాన్ని కాషాయమయం చేస్తున్నామని తెలిపారు. ఎలాంటి గొడవలకు తావులేకుండా అత్యంత భక్తియుత, ఆధ్యాత్మిక వాతావరణంలో ఉత్సాహంగా నిమజ్జన ఉత్సవాలు జరుపుకోవాలని కరీంనగర్ ప్రజలకు విజ్ఝప్తి చేశారు. పుకార్లను నమ్మొద్దని కోరారు. గణేశ్ నిమజ్జనాల సందర్భంగా పోలీసులు అత్యంత సంయమనం పాటించాలని సూచించారు. ఈరోజు ఉదయం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఏసీపీ వెంకటస్వామి, సీఐలు రామచంద్రరావు, స్రుజన్ రెడ్డి, తిరుమల్, బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్, కార్పొరేటర్ బోయినిపల్లి ప్రవీణ్ రావులతో సమావేశమై గణేశ్ నిమజ్జన ఉత్సవాల రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన కార్యాచరణపై పలు సూచనలు చేశారు. ‘‘ప్రశాంతతకు భక్తియుత వాతావరణానికి కరీంనగర్ ప్రతీక. ఈసారి గణేశ్ నిమజ్జన ఉత్సవాలను అత్యంత శోభాయమనంగా జరుపుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. మంచినీళ్లు సహా కనీస సౌకర్యాలన్నీ అందుబాటులో ఉంచుతున్నాం. దయచేసి పోలీసులు సహకరించాలి. పోలీసులకు ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితో మేయర్, డిప్యూటీ మేయర్ తో మాట్లాడండి. భక్తులతో మాట్లాడి ఇబ్బందుల్లేకుండా సాఫీగా నిమజ్జనం జరిగేలా చర్యలు తీసుకుంటాం.’’అని చెప్పారు. కొందరు కావాలనే గొడవ చేసి నిమజ్జన ఉత్సవాల ప్రశాంతతను చెడగొట్టాలని కుట్ర చేసే ప్రమాదం ఉందని, అట్లాంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
సమావేశానంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ ‘‘ప్రతి ఒక్కరూ భక్తియుత, ధార్మిక వాతావరణంలో నిమజ్జన ఉత్సవాలు నిర్వహించాలి. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు. పోలీసులకు పూర్తిగా సహకరించాలని కోరుతున్నా. ప్రశాంతతగా మారుపేరు కరీంనగర్ అని నిరూపిద్దాం. అధికారులు, పోలీసుల నుండి ఏమైనా ఇబ్బందులుంటే మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లను సంప్రదించండి. తప్పకుండా ఇబ్బందులను తొలగిస్తాం.’’అని కోరారు.
‘‘కరీంనగర్ లో గణేశ్ నవరాత్రి నిమజ్జన ఉత్సవాలను గతం కంటే ఘనంగా నిర్వహించబోతున్నం. గతంకంటే ఎక్కువ బడ్జెట్ ను ఈసారి కేటాయించాం. గణేశ్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత పవిత్రమైనవి. గణేశ్ నవరాత్రి ఉత్సవాలను భక్తితో నిష్టగా ఎవరు చేసినా సక్సెస్ అవుతారు. ఈసారి గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా కన్పిస్తుండటం హర్షణీయం’’అని చెప్పారు.
*మోదీజీ వర్ధిల్లు నూరేళ్లు*
అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ , స్థానిక కార్పొరేటర్లతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ రేకుర్తి వెళ్లారు. మోదీ 25 ఏళ్ల ప్రజా పాలనను పురస్కరించుకుని బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రక్తదాన శిబిరం’ ను సందర్శించారు. జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశంతోపాటు పలువురు బీజేపీ నేతలు స్వచ్ఛందంగా రక్తదానం చేయడాన్ని గమనించిన కేంద్ర మంత్రి ఆయా నేతలను అభినందించారు. మోదీ పాలనలో దేశం ఎంతో అభివ్రుద్ధి చెందిందని, ప్రజల జీవితాల్లో మార్పు వచ్చిందన్నారు. 25 కోట్ల మందిని పేదరికం నుండి బయటకు తీసుకొచ్చారని చెప్పారు. మోదీతోనే దేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలవడం ఖాయమని, ఈ నేపథ్యంలో నిండు నూరేళ్లు ప్రజా సేవలో తరించేలా మోదీని ఆశీర్వాదించాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు.
*అందరికీ ‘ఆధార్’ బయోమెట్రిక్ తప్పనిసరి*
అక్కడి నుండి నేరుగా కమాస్ సర్కిల్ వద్దకు వచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మేయర్, డిప్యూటీ మేయర్ లతో కలిసి నూతనంగా ఏర్పాటు చేసిన ‘ఆధార్ సెంటర్’ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆధార్ తప్పనిసరి అని గుర్తు చేశారు. ముఖ్యంగా 5 నుండి 15 ఏళ్లు నిండిన పిల్లలంతా ఆధార్ సెంటర్ కు వెళ్లి బయోమెట్రిక్ తప్పనిసరిగా చేయించాలని కోరారు. ఆధార్ అప్ డేట్ చేయించడంవల్ల ప్రభుత్వ ప్రయోజనాలు పొందడమే కాకుండా జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలు రాసేటప్పుడు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరగడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
*పలు గణేశ్ మండపాలను సందర్శించిన కేంద్ర మంత్రి*
గణేశ్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని గత కొద్దిరోజులుగా తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పలు గణేశ్ మండపాలను సందర్శిస్తున్నారు. నిన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన బండి సంజయ్ సిరిసిల్ల టౌన్, వేములవాడ టౌన్ లో పలు గణేశ్ మండపాలను సందర్శించి గణనాథుడిని దర్శించుకున్నారు. యువత, పిల్లలు, మహిళలుసహా గణేశ్ మండపాల వద్దకు వచ్చిన వారందరితో ముచ్చటించారు. ఈరోజు సైతం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కరీంనగర్ లోని కాపువాడ, పాతబజార్ , మంగళ్ వాడ, మోచీ నగర్ ప్రాంతాల్లో పర్యటించి పలు గణేశ్ మండపాలను సందర్శించారు. మధ్యాహ్నం వర్షం కురవడంతో.. వానను సైతం లెక్క చేయకుండా గణనాథులను దర్శించుకోవడం గమనార్హం.