శ్రీలంకపై సిరీస్ కైవసం చేసుకున్న ఇంగ్లండ్
కార్డిఫ్:గురువారం సోఫియా గార్డెన్స్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో శ్రీలంకపై ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయాంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇంగ్లండ్ 2-0తో సొంతం చేసుకుంది. టీ20 క్రికెట్‌లో శ్రీలంకపై ఇంగ్లండ్‌కు ఇది వరుసగా 14వ విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ తన కెరీర్‌లో 15,000 టీ20 పరుగులు పూర్తి చేసి, ఈ మైలురాయిని చేరుకున్న తొలి బ్యాట్స్‌మన్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఓపెనర్ పతుమ్ నిస్సంక (37) రాణించినప్పటికీ, ఇంగ్లండ్ స్పిన్నర్ లియామ్ డాసన్ (3/32), ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ (2/34), సోనీ బేకర్ (1/15) ధాటికి శ్రీలంక వరుసగా వికెట్లు కోల్పోయింది. అనంతరం 146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్, టామ్ బాంటన్ (52 నాటౌట్) అర్ధశతకంతో విరుచుకుపడటంతో కేవలం 12.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. డాసన్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' లభించింది. సిరీస్‌లోని చివరి టీ20 శనివారం మాంచెస్టర్‌లో జరగనుంది.