ఢిల్లీ-ఎన్‌సీఆర్ సహా 20 రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన వర్షాలు
న్యూఢిల్లీ:దేశ రాజధాని ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు పలు రాష్ట్రాల్లో మంగళవారం వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండి, అక్కడక్కడా తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) తెలిపింది. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 32-34 డిగ్రీలు, కనిష్టంగా 23-25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావచ్చు.
మరోవైపు దేశంలోని 20 రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ఐఎమ్‌డీ హెచ్చరించింది. ఈ సమయంలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. వర్ష ప్రభావం ఉండే ప్రాంతాల్లో తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఉత్తరాఖండ్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, గుజరాత్, మహారాష్ట్రలు ఉన్నాయి.
నైరుతి రుతుపవనాలు సెప్టెంబర్ 19 నుంచి పశ్చిమ రాజస్థాన్ మీదుగా వైదొలగడం ప్రారంభమవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా ఇవి సెప్టెంబర్ 17న వైదొలుగుతాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షపాత లోటు 15 శాతంగా ఉంది. రుతుపవనాల నిష్క్రమణ ప్రక్రియ మొదలవుతున్నప్పటికీ, ఈ వారంలో పశ్చిమ, వాయువ్య, దక్షిణ భారత ప్రాంతాల్లో మరికొన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది.