పిల్లల రక్షణే మా ప్రాధాన్యత
I4C పోర్టల్‌కు సైబర్ వివరాల నివేదనకు మెటా అంగీకారం
న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌లో పిల్లలపై జరిగే లైంగిక వేధింపులు, లైంగిక దోపిడీ నేరాలను అరికట్టేందుకు తాము కట్టుబడి ఉన్నామని సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' పునరుద్ఘాటించింది. ఇకపై పిల్లల భద్రతకు సంబంధించిన విషయాలను నేరుగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్‌క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) నిర్వహిస్తున్న సైబర్‌క్రైమ్ పోర్టల్‌కు నివేదిస్తామని మెటా ప్రతినిధి మంగళవారం వెల్లడించారు. తమ ప్లాట్‌ఫారమ్‌లలో పిల్లలను రక్షించడానికే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, నేరస్తులను చట్టం ముందు నిలబెట్టేందుకు భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని తెలిపారు.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి ప్లాట్‌ఫారమ్‌లను నిర్వహిస్తున్న మెటాపై ఇటీవల తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో పెయిడ్ ప్రకటనల ద్వారా బాలల లైంగిక వేధింపుల సామగ్రి (CSAM) ప్రచారమవుతోందన్న ఆరోపణలపై విచారణకు సంబంధించి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) మెటా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, హెడ్‌కు సమన్లు జారీ చేయడంతో సంస్థ ప్రతినిధులు హాజరై తమ వివరణ ఇచ్చారు. అలాగే జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కూడా పోక్సో (POCSO) చట్టం ప్రకారం మెటా తన రిపోర్టింగ్ బాధ్యతలను నెరవేర్చిందో లేదో తనిఖీ చేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించిన నేపథ్యంలో మెటా ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.