భారత్-జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యంపై ప్రధాని మోదీ, ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ సమీక్ష
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీతో జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ గురువారం టెలిఫోన్ ద్వారా సంభాషించారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు పూర్తవుతున్న శుభతరుణంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సందర్భంగా భారత్-జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధించిన పురోగతిని ఇద్దరు నాయకులు సమీక్షించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం (PMO) వెల్లడించింది. ఉన్నత స్థాయి దౌత్య సంబంధాల్లో కొనసాగుతున్న పురోగతిపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు.
వాణిజ్యం, పెట్టుబడులు, అధునాతన సాంకేతికతలు, స్వచ్ఛ ఇంధనం, రక్షణ, విద్య మరియు ప్రతిభ బదిలీ (Talent Mobility) వంటి కీలక రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇరుదేశాల నాయకులు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.
అలాగే పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలను పంచుకోవడంతో పాటు, ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం కలిసికట్టుగా పనిచేయడానికి ప్రధాని మోదీ, ఛాన్సలర్ మెర్జ్ అంగీకరించారని PMO స్పష్టం చేసింది.