నమోదుకాని రంగంపై NSO తొలి జిల్లా స్థాయి నివేదిక విడుదల
న్యూఢిల్లీ: దేశంలోని నమోదుకాని వ్యవసాయేతర రంగానికి సంబంధించి జాతీయ గణాంక కార్యాలయం (NSO) చరిత్రలోనే మొదటిసారిగా జిల్లా స్థాయి అంచనాలను విడుదల చేసింది. 'నమోదుకాని రంగ సంస్థల వార్షిక సర్వే (ASUSE) 2025' ద్వారా దేశవ్యాప్తంగా 757 జిల్లాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్లు కేంద్ర గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఈ నివేదిక ప్రకారం నమోదుకాని వ్యవసాయేతర రంగం దేశంలో భౌగోళికంగా కొన్ని జిల్లాల్లోనే ఎక్కువగా కేంద్రీకృతమైంది. దేశంలోని అగ్రగామి 10 జిల్లాలు మొత్తం సంస్థలు, శ్రామిక శక్తి, స్థూల విలువ జోడింపు (GVA)లో దాదాపు 10 శాతం వాటాను కలిగి ఉండగా, అగ్రగామి 50 జిల్లాలు ఏకంగా మూడింట ఒక వంతు వాటాను ఆక్రమించాయి.
దేశవ్యాప్తంగా కేవలం 16 జిల్లాల్లో మాత్రమే ఒక్కో జిల్లాలో 5 లక్షలకు పైగా నమోదుకాని సంస్థలు ఉన్నట్లు సర్వే పేర్కొంది. వీటిలో పశ్చిమ బెంగాల్‌లో 8, మహారాష్ట్రలో 3, గుజరాత్‌లో 2 ఉండగా తెలంగాణ, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్‌లలో ఒక్కో జిల్లా ఉన్నాయి.
ఈ రంగంలో మహిళా పారిశ్రామికవేత్తలు, కార్మికుల భాగస్వామ్యంలో తెలంగాణ, మణిపూర్, మేఘాలయ, మిజోరం రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. మహిళల నేతృత్వంలోని సంస్థలు, శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం అత్యధికంగా ఉన్న అగ్ర 10 జిల్లాల్లో తెలంగాణ జిల్లాలు చోటు దక్కించుకున్నాయి. మిజోరంలోనైతే ప్రతి జిల్లాలోనూ కనీసం 50 శాతం సంస్థలు మహిళల యాజమాన్యంలోనే నడుస్తుండటం విశేషం. దేశంలోని 237 జిల్లాల్లో మొత్తం శ్రామిక శక్తిలో మహిళలు కనీసం మూడింట ఒక వంతు ఉన్నారు.
ఆర్థిక ఉత్పాదకత పరంగా చూస్తే, దేశవ్యాప్తంగా 280 జిల్లాల్లో ఒక్కో కార్మికుని స్థూల విలువ జోడింపు (GVA) అఖిల భారత సగటు అయిన ₹1,56,539 కంటే ఎక్కువగా నమోదైంది. పెద్ద రాష్ట్రాల్లో ఆర్థిక కార్యకలాపాలు కొన్ని నిర్దిష్ట జిల్లాల్లోనే ఎక్కువగా కేంద్రీకృతమయ్యాయని, తెలంగాణలోని మొత్తం నమోదుకాని సంస్థల్లో ఒక్క రంగారెడ్డి జిల్లా వాటాయే 23.53 శాతంగా ఉందని నివేదిక స్పష్టం చేసింది. గుజరాత్‌లో సూరత్ (19.43%), కర్ణాటకలో బెంగళూరు అర్బన్ (12.83%), మహారాష్ట్రలో పూణే (9.14%) అత్యధిక వాటాను కలిగి ఉన్నాయి.