భవిష్యత్తు విద్యకు బాటలు
'పీఎం శ్రీ' పథకంతో రూపురేఖలు మారనున్న పాఠశాలలు
న్యూఢిల్లీ:దేశీయ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తూ, పాఠశాలలను భవిష్యత్తు సవాళ్లకు సిద్ధం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా’ (పీఎం శ్రీ) పథకాన్ని విస్తృతంగా అమలు చేస్తోంది. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) 2020కి అనుగుణంగా దేశవ్యాప్తంగా 14,500కు పైగా పాఠశాలలను ఆదర్శవంతమైన విద్యా సంస్థలుగా తీర్చిదిద్దడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. కేంద్ర ప్రాయోజిత పథకంగా అమలువుతున్న ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 27,360 కోట్లు కాగా, అందులో కేంద్ర వాటా రూ. 18,128 కోట్లు.
ప్రస్తుతం 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 725 జిల్లాల్లో ఉన్న 13,092 పాఠశాలలను ఈ పథకం కింద ఎంపిక చేశారు. దీనిద్వారా దాదాపు 20 లక్షల మంది విద్యార్థులకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరనుంది. కేవలం భవనాల ఆధునీకరణకే పరిమితం కాకుండా సామర్థ్య ఆధారిత విద్య, సాంకేతిక పరిజ్ఞానం, గ్రీన్ స్కూల్స్, మాతృభాషా బోధన మరియు ఉపాధ్యాయుల శిక్షణ వంటి ఆరు ప్రధాన స్తంభాలపై ఈ పథకం పనిచేస్తుంది.
విద్యార్థుల్లో సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచనలను పెంపొందించేందుకు బట్టీ పద్ధతికి స్వస్తి పలికి బ్యాగ్‌లెస్ డేస్, స్థానిక కళలు-చేతివృత్తులలో శిక్షణ, క్రీడలతో కూడిన అనుభవపూర్వక బోధనను అందిస్తున్నారు. అలాగే ఐసీటీ (ICT) సౌకర్యాలు, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, దీక్ష యాప్ ద్వారా డిజిటల్ లెర్నింగ్‌ను పెంపొందిస్తున్నారు. ఛాలెంజ్ మోడ్‌లో ఎంపిక చేసిన ఈ పాఠశాలలు తమ పొరుగున ఉన్న ఇతర పాఠశాలలకు మార్గదర్శకంగా నిలుస్తూ విద్యా ప్రమాణాల పెంపునకు దోహదపడనున్నాయి.