2035 నాటికి భారతదేశ సెమీకండక్టర్ మార్కెట్ $200 బిలియన్లకు చేరనుంది
ఈవై-ఐఈఎస్ఏ నివేదిక
న్యూఢిల్లీ: భారతదేశ సెమీకండక్టర్ మార్కెట్ 2026లో ఉన్న 64 బిలియన్ డాలర్ల నుండి 2035 నాటికి మూడు రెట్లకు పైగా పెరిగి 200 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఈవై-ఐఈఎస్ఏ (EY-IESA) సంయుక్త నివేదిక అంచనా వేసింది. 'సెమికాన్ ఇండియా 2.0: సామర్థ్య సృష్టి నుండి పర్యావరణ వ్యవస్థ నాయకత్వం వరకు' శీర్షికతో విడుదలైన ఈ నివేదిక, పెరుగుతున్న దేశీయ డిమాండ్‌ను స్థానిక తయారీ, ఆవిష్కరణలు మరియు బ బలమైన సరఫరా-గొలుసు వ్యవస్థగా మలచుకోవడానికి గొప్ప అవకాశం ఏర్పడిందని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ మార్కెట్‌లో వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ వాటా 30 శాతంగా ఉండగా, ఆటోమోటివ్ రంగం 16 శాతం, పారిశ్రామిక రంగాలు 15 శాతం వాటాను కలిగి ఉన్నాయి.
దేశంలో పెరిగిన ఎలక్ట్రానిక్స్ వినియోగం వల్ల సెమీకండక్టర్ దిగుమతులు 2017 ఆర్థిక సంవత్సరంలో 5.7 బిలియన్ డాలర్ల నుండి 2025 ఆర్థిక సంవత్సరాంతానికి 30.3 బిలియన్ డాలర్లకు (23 శాతం సీఏజీఆర్) పెరిగాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని స్థానిక ఫ్యాబ్రికేషన్, చిప్ తయారీ సామర్థ్యాలను వేగవంతం చేయాలని నివేదిక సూచించింది. ప్రపంచంలోని మొత్తం చిప్ డిజైన్ ఇంజనీర్లలో దాదాపు 20 శాతం మంది భారతదేశంలోనే ఉండటం దేశీయ రంగానికి అతిపెద్ద బలంగా మారింది. మరోవైపు దేశీయ మొత్తం ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి కూడా 2015లో రూ. 1.9 లక్షల కోట్ల నుండి 2025 నాటికి రూ. 11.3 లక్షల కోట్లకు, అంటే దాదాపు ఆరు రెట్లు పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.
ఈ సందర్భంగా భారత ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్ (IESA) అధ్యక్షుడు అశోక్ చందక్ మాట్లాడుతూ, భారత్ తన ఇంజనీరింగ్ ప్రతిభను, ఎలక్ట్రానిక్స్ డిమాండ్‌ను అంతర్జాతీయ సరఫరా భాగస్వామ్యాలతో అనుసంధానించాలని పేర్కొన్నారు. ఈవై ఇండియా ప్రతినిధి ఐషా అలీ హుస్సేనీ మాట్లాడుతూ, ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలను పెంచేందుకు కేంద్ర-రాష్ట్ర విధానాల మధ్య స్పష్టమైన సమన్వయం ఉండాలని కోరారు. అధునాతన ప్యాకేజింగ్, కాంపౌండ్ సెమీకండక్టర్లు, ఫోటోనిక్స్ రంగాలు రాబోయే రోజుల్లో కీలక పాత్ర పోషిస్తాయని, రాష్ట్ర స్థాయి విధానాలను 'సెమికాన్ 2.0'తో అనుసంధానిస్తూ ప్రత్యేక తయారీ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని నివేదిక సిఫార్సు చేసింది.