అక్టోబర్ 1 నుంచి సబ్సిడీ ఎల్పీజీ రీఫిల్‌లకు బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణ తప్పనిసరి
న్యూఢిల్లీ: అక్టోబర్ 1, 2026 నుంచి సబ్సిడీ ధరకే గృహ వినియోగ ఎల్పీజీ రీఫిల్‌లను పొందడానికి బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణ (BAA) తప్పనిసరి అవుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సబ్సిడీ సిలిండర్లు అర్హులైన గృహాలకు మాత్రమే చేరేలా చూడటం, వాణిజ్య మరియు పారిశ్రామిక అవసరాలకు మళ్లించకుండా నిరోధించడమే ఈ నిర్ణయం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సెప్టెంబర్ 19 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న 27.43 కోట్ల మంది (89.9 శాతం) క్రియాశీల వినియోగదారులు ఇప్పటికే ఈ ప్రక్రియను పూర్తి చేశారని, వారు ఎలాంటి పునరుద్ధరణలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
ఇంకా ధృవీకరణ పూర్తి చేయని వినియోగదారులు డిస్ట్రిబ్యూటర్ షోరూమ్‌లలో, డెలివరీ సమయంలో లేదా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (OMC) యాప్‌ల ద్వారా పూర్తి చేసుకోవచ్చు. ఇండేన్ వినియోగదారులు ఇండియన్‌ఆయిల్ వన్ యాప్, భారత్‌గ్యాస్ వినియోగదారులు హలోబీపీసీఎల్ యాప్, హెచ్‌పి గ్యాస్ వినియోగదారులు హెచ్‌పి పే యాప్ ద్వారా ఇంటి నుంచే ఆధార్ ప్రామాణీకరణను పూర్తి చేసుకోవచ్చని సూచించారు. బయోమెట్రిక్ ప్రక్రియకు ఇష్టపడని వారు ఓఎంసీల డిజిటల్ ఛానెళ్ల ద్వారా తమ ఎంపికను నమోదు చేసుకుని, సబ్సిడీ లేకుండా మార్కెట్ ధరకు 5 కేజీల లేదా 10 కేజీల సిలిండర్లను పొందే వెసులుబాటు ఉంది.
గృహ వినియోగ ఎల్‌పిజిని అందుబాటు ధరలోనే ఉంచేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని వెల్లడించింది. జూన్ 2026లో 14.2 కేజీల సిలిండర్‌పై పరోక్ష సబ్సిడీ రూ. 721 ఉండగా, సెప్టెంబర్ 2026 నాటికి అది సుమారు రూ. 210కి తగ్గింది. అయినప్పటికీ, ఆగస్టు 31, 2026 నాటికి గృహ వినియోగ ఎల్‌పిజిపై ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల పేరుకుపోయిన బకాయిలు రూ. 62,000 కోట్లను దాటాయని తెలిపింది. అర్హులైన వినియోగదారులందరూ అక్టోబర్ 1 లోపు ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని, సహాయం కోసం 1800 2333 555 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చని కోరింది.