అమెరికా ప్రతినిధులతో పుతిన్ భేటీ
ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలపై చర్చలు
మస్కట్ (రష్యా): రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శనివారం అమెరికా రాయబారులతో మాస్కోలో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. డోనాల్డ్ ట్రంప్ పంపిన అమెరికా ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్‌లతో క్రెమ్లిన్‌లో దాదాపు మూడు గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది.
ఉక్రెయిన్ వివాద పరిష్కారానికి సంబంధించి అమెరికా ప్రతినిధులు పలు ఆలోచనలను పుతిన్ ముందు ఉంచినట్లు క్రెమ్లిన్ సహాయకుడు యూరి ఉషాకోవ్ తెలిపారు. అయితే, ఈ చర్చల్లో స్పష్టమైన పురోగతి ఏదీ సాధించలేదని ఆయన పేర్కొన్నారు.
రష్యా యుద్ధభూమిలో నిజమైన పురోగతి సాధిస్తోందని, సంక్షోభానికి గల మూలకారణాలను పూర్తిగా పరిష్కరించినప్పుడే శాంతి సాధ్యమవుతుందని అమెరికా బృందంతో పుతిన్ స్పష్టం చేశారు.
ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చొరవను, శాంతి ప్రయత్నాలను పుతిన్ ప్రశంసించారు. కేవలం ఉక్రెయిన్ అంశమే కాకుండా ఆర్థిక విభాగాలు, రష్యా-అమెరికా మధ్య ప్రాజెక్టుల గురించి కూడా వివరంగా చర్చించినట్లు క్రెమ్లిన్ తెలిపింది.
చర్చలు పూర్తయిన వెంటనే అమెరికా ప్రతినిధుల బృందం మాస్కో నుండి బయలుదేరింది. ఆదివారం రోజున కీవ్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో వీరు భేటీ కానున్నారు. అమెరికా ప్రతినిధుల పర్యటన భద్రత దృష్ట్యా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై మూడు రోజుల పాటు ఎలాంటి దాడులు చేయవద్దని రష్యా సైన్యాన్ని పుతిన్ ఆదేశించారు. తదుపరి చర్యలకు సంబంధించిన వివరాలను రాబోయే వారాల్లో ప్రకటిస్తామని వైట్ హౌస్ వెల్లడించింది.