GV Narayana Rao: సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత.. సినీ లోకంలో విషాదం
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణ రావు (73) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
జీవీ నారాయణ రావు మృతిని నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆయనతో కలిసి దిగిన ఫొటోను పంచుకుంటూ భావోద్వేగ నివాళి అర్పించారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తొలి సినిమాతోనే నంది అవార్డు
1976లో ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ తెరకెక్కించిన అంతులేని కథ సినిమాతో జీవీ నారాయణ రావు నటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. తొలి చిత్రంతోనే తన నటనకు గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు.
ఆ తర్వాత ఎన్నో విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల మెప్పు పొందారు. తన సినీ ప్రయాణంలో 100కు పైగా చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
చిరంజీవితో ప్రత్యేక అనుబంధం
జీవీ నారాయణ రావుకు మెగాస్టార్ చిరంజీవితో సుదీర్ఘ స్నేహబంధం ఉంది. బాల్య మిత్రుడైన చిరంజీవితో ఆయనకు ఎంతో ఆత్మీయ అనుబంధం ఉండేదని కరాటే కళ్యాణి తన నివాళి సందేశంలో పేర్కొన్నారు. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్‌తోనూ ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉంది.
ఎలాంటి భేషజాలకు తావులేకుండా అందరినీ ఆప్యాయంగా పలకరించే వ్యక్తిగా జీవీ నారాయణ రావుకు మంచి పేరుంది. ఆయన మరణంతో ఒక సీనియర్ నటుడిని మాత్రమే కాకుండా.. ఎంతో ఆత్మీయమైన వ్యక్తిని కోల్పోయామని సినీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
కరాటే కళ్యాణి భావోద్వేగ నివాళి
జీవీ నారాయణ రావు మృతిపై కరాటే కళ్యాణి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె పోస్టుపై నెటిజన్లు స్పందిస్తూ సీనియర్ నటుడి మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు.