2047 నాటికి వికసిత భారత్ సాధనకు ప్రతి గ్రామం, పౌరుడు వికసితంగా మారాలి
ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
షిల్లాంగ్: 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశమనే లక్ష్యాన్ని సాధించాలంటే సమాజంలోని ఏ వర్గాన్నీ వెనుక వదలకుండా, ప్రతి రాష్ట్రం, గ్రామం మరియు పౌరుడు ‘వికసిత’గా మారాలని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోని సోసో థామ్ ఆడిటోరియంలో రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు ఆయన గౌరవార్థం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉపరాష్ట్రపతి మాట్లాడారు. నిజమైన లౌకికవాదం అంటే ఒకరి ఆలోచనలను, నమ్మకాలను మరొకరు గౌరవించుకోవడమేనని, ప్రజలందరూ పరస్పర గౌరవంతో, సామరస్యంతో కలిసి జీవించాలని ఉద్ఘాటించారు. ఈశాన్య ప్రాంతంలో అనుసంధానతను పెంచేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని చెబుతూ, గడిచిన దశాబ్ద కాలంలో ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద ₹47,000 కోట్లకు పైగా వ్యయంతో 46,000 కిలోమీటర్లకు పైగా గ్రామీణ రహదారులను నిర్మించినట్లు తెలిపారు.
ఈ పర్యటనలో భాగంగా మేఘాలయలో మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, తాగునీరు, విద్యుత్ రరంగాలను బలోపేతం చేసేందుకు రూ.1,042 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఉపరాష్ట్రపతి శ్రీకారం చుట్టారు. ఇందులో ₹850.58 కోట్ల వ్యయంతో చేపట్టిన కొత్త షిల్లాంగ్ నీటి సరఫరా పథకం ఫేజ్-2, రోడ్డు ప్రాజెక్టులు, ఆయుష్ సౌకర్యం, సబ్‌స్టేషన్ నిర్మాణంతో కూడిన ₹1,010.95 కోట్ల విలువైన ఐదు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అలాగే నాంగ్‌స్టోయిన్‌లో ₹31.05 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రసూతి, బాలల ఆసుపత్రిని ప్రారంభించారు. ముఖ్యమంత్రి కాన్రాడ్ కె. సంగ్మా నాయకత్వంలో హోమ్‌స్టే, గ్రీన్ మేఘాలయ వంటి పథకాలతో రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని అభినందించిన ఉపరాష్ట్రపతి, ప్రకృతిని పరిరక్షిస్తూనే అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మేఘాలయ ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.