జాతీయ అభివృద్ధికి శ్రామిక శక్తే మూలస్తంభం
కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ
ముంబై:దేశ నిర్మాణంలో శ్రామిక శక్తి పాత్ర అత్యంత కీలకమైనదని, కార్మికుల సంక్షేమం మరియు సామాజిక భద్రతతోనే భారతదేశ అభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. ముంబైలో నిర్వహించిన 'భవన మరియు ఇతర నిర్మాణ రంగ కార్మికుల' (BOCW) రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ చర్యలను బలోపేతం చేయడానికి మరియు BOCW నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ము ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్మికులకు సమాజంలో మరింత గౌరవం, ఆత్మగౌరవం కల్పించడంలో భాగంగా వారికి పెన్షన్ సౌకర్యం అందించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. అలాగే అంతర్జాతీయంగా లభిస్తున్న కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేలా భారతీయ శ్రామిక శక్తిని సిద్ధం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని, అందుకు అనుగుణంగా డిజిటల్ మౌలిక సదుపాయాలను పెంపొందించాలని స్పష్టం చేశారు.
కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి చంద్ర భూషణ్ కుమార్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 7 కోట్లకు పైగా నిర్మాణ రంగ కార్మికులు ఉన్నారని, వారి సంక్షేమం కోసం సుమారు రూ. 77,000 కోట్ల BOCW సెస్ నిధి అందుబాటులో ఉందని తెలిపారు. కార్మికులు ఉపాధి నిమిత్తం ఏ ప్రాంతానికి వలస వెళ్లినా సంక్షేమ పథకాలు సులభంగా అందేలా సమగ్ర విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సదస్సులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు సహా పలు రాష్ట్రాలు అమలు చేస్తున్న డిజిటల్ లేబర్ చౌక్, ఆన్‌లైన్ సెస్ వసూలు పోర్టల్ వంటి ఉత్తమ విధానాలను ప్రదర్శించారు. సెస్ నిధులను పారదర్శకంగా, సకాలంలో కార్మికుల విద్య, వైద్యం మరియు భద్రతకు వినియోగించాలని కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల కార్మిక శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.