ఢిల్లీలో 'సేవా సంకల్ప అభియాన్'
న్యూఢిల్లీ:ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప అభియాన్’ నిర్వహిస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా రూ.13,820 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నట్లు సోమవారం ప్రకటించారు.
ఈ ప్రచారంలో భాగంగా యమునా నది శుద్ధి, పునరుజ్జీవనానికి రూ.8,000 కోట్ల ప్రాజెక్టులతో పాటు 70 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. వీటితో పాటు రక్తదాన శిబిరాలు, 25 వేల మంది వృద్ధులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు, అవయవ దానానికి 'SOTTO' ప్లాట్‌ఫామ్, 70 నియోజకవర్గాల్లో ‘సేవా సేతు’ శిబిరాల ద్వారా సంక్షేమ పథకాల నమోదును చేపట్టనున్నారు. 5,000 పాఠశాలల విద్యార్థులకు పోటీలు, అంగన్‌వాడీ కార్యకర్తలకు సన్మాన కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.