రోజ్‌గార్ మేళాలో నేడు 51 వేలకు పైగా నియామక పత్రాల పంపిణీ
న్యూఢిల్లీ:వివిధ ప్రభుత్వ శాఖల్లో కొత్తగా ఎంపికైన యువతకు నేడు జరిగే 20వ 'రోజ్‌గార్ మేళా'లో ప్రధాని నరేంద్ర మోదీ 51,000కు పైగా నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొని, నియామక పత్రాలు అందజేయడంతో పాటు అభ్యర్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో ఈ 20వ రోజ్‌గార్ మేళా నిర్వహించబడుతోంది. కొత్తగా ఎంపికైన నిపుణులు రైల్వే, హోం వ్యవహారాలు, రెవెన్యూ, రక్షణ, ఆరోగ్యం మరియు ఆర్థిక సేవల విభాగాల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమంతో కలిపి ఇప్పటివరకు వివిధ ప్రభుత్వ శాఖల్లో మొత్తం 12.75 లక్షల మందికి పైగా యువతకు నియామక పత్రాలు అందించినట్లవుతుంది. దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతోనే ఈ మేళాలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.