₹5,000 కోట్ల ఆస్తుల నగదీకరణకు ఎన్‌ఎల్‌ఎంసి సిఫార్సు
న్యూఢిల్లీ:కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, వివిధ ప్రభుత్వ విభాగాల వద్ద ఉన్న మిగులు భూములు, భవనాల ఆస్తుల వినియోగాన్ని వేగవంతం చేసే దిశగా నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (NLMC) కీలక నిర్ణయం తీసుకుంది. రూ.5,000 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ ఆస్తుల నగదీకరణ (మొనెటైజేషన్) కోసం రూపొందించిన ప్రతిపాదనలను సంస్థ బోర్డు సిఫార్సు చేసింది.
సెప్టెంబర్ 18న జరిగిన ఎన్‌ఎల్‌ఎంసి డైరెక్టర్ల బోర్డు 21వ సమావేశంలో ఈ ప్రతిపాదనలపై సమగ్ర చర్చ జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేషన్ ఆర్థిక పనితీరు, కొనసాగుతున్న ఆస్తుల నగదీకరణ కార్యక్రమాల పురోగతిని బోర్డు పునఃసమీక్షించింది. అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆర్థిక నివేదికలతో పాటు డైరెక్టర్ల నివేదికకు ఆమోదం తెలిపింది.
మిగులు భూములు, భవనాలను పారదర్శకమైన, వేగవంతమైన యంత్రాంగాల ద్వారా వాణిజ్యపరంగా గరిష్ట స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడమే ఎన్‌ఎల్‌ఎంసి ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. ఇందుకోసం సంబంధిత మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో సమన్వయాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతామని వెల్లడించారు.