డీయూఎస్‌యూ ఎన్నికల నామినేషన్లు
నార్త్ క్యాంపస్‌లో ట్రాఫిక్ ఆంక్షలు జారీ చేసిన ఢిల్లీ యూనివర్సిటీ
న్యూఢిల్లీ: రాబోయే ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (DUSU) ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో నార్త్ క్యాంపస్ పరిధిలో సెప్టెంబర్ 10, 11 తేదీలలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు వర్సిటీ యంత్రాంగం ప్రకటించింది. ఈ మేరకు ఛాత్రా మార్గ్, ప్రోబైన్ రోడ్, యూనివర్సిటీ రోడ్, జి.సి. నారంగ్ మార్గ్‌లలో వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ అడ్వైజరీ జారీ చేశారు. అంతేకాకుండా, నార్త్ క్యాంపస్ గేట్ నెం. 4 ను ఈ రెండు రోజులు పూర్తిగా మూసివేయనున్నారు.
ఈ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటలకు చెల్లుబాటయ్యే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. సెప్టెంబర్ 11 మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. అనంతరం తుది అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు. డీయూఎస్‌యూ ఎన్నికల పోలింగ్ సెప్టెంబర్ 18న నిర్వహించనుండగా, మరుసటి రోజైన సెప్టెంబర్ 19న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.