సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో అధునాతన వైద్య సేవలు
PET-CT, SPECT-CT, మూత్రాశయ నిర్ధారణ కేంద్రాలను ప్రారంభించిన జె.పి. నడ్డా
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజ్ (VMMC), సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో అత్యంత అధునాతన వైద్య నిర్ధారణ కేంద్రాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జె.పి. నడ్డా గురువారం ప్రారంభించారు. యూరాలజీ విభాగంలో అధునాతన మూత్రాశయ నిర్ధారణ కేంద్రంతో పాటు న్యూక్లియర్ మెడిసిన్ విభాగంలో PET-CT, SPECT-CT సౌకర్యాలను ఆయన ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని హార్ట్ కమాండ్ సెంటర్, స్పోర్ట్స్ ఇంజ్యూరీ సెంటర్లను కూడా ఆయన సందర్శించి సమీక్షించారు.
వీడియో యూరోడైనమిక్స్ (VUDS) మరియు నియర్ ఇన్‌ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ (NIRS) ఆధారిత బ్రెయిన్ మ్యాపింగ్‌లను అనుసంధానించి ఈ మూత్రాశయ నిర్ధారణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దేశంలోనే మొదటిసారిగా అందుబాటులోకి వచ్చిన ఈ విధానం ద్వారా, మూత్రాశయం నిండేటప్పుడు మరియు ఖాళీ అయ్యే సమయంలో మెదడులోని ఆక్సిజన్ మార్పులను విశ్లేషిస్తారు. దీనివల్ల మూత్రాశయ వ్యాధులు నాడీ సంబంధితమా లేదా ఇతర సమస్యల వల్ల వస్తున్నాయా అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఈ కేంద్రం ద్వారా ఏటా సుమారు 5,000 మంది రోగులకు లబ్ధి చేకూరనుంది.
క్రొత్తగా అందుబాటులోకి వచ్చిన PET-CT, SPECT-CT సౌకర్యాలు క్యాన్సర్ నిర్ధారణ, స్టేజింగ్, చికిత్స ప్రణాళికతో పాటు గుండె, మూత్రపిండాలు, నరాల వ్యాధుల నిర్ధారణకు ఎంతగానో తోడ్పడతాయి. అత్యంత అధునాతనమైన ఈ న్యూక్లియర్ మెడిసిన్ సేవలు ఏటా 600 నుండి 700 మంది రోగులకు తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయి.
ఆసుపత్రి పనితీరును సమీక్షించిన కేంద్ర మంత్రి జె.పి. నడ్డా.. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి స్పష్టమైన కాలపరిమితిని నిర్దేశించుకోవాలని ఆదేశించారు. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి వైద్యసేవల్లో సాధించిన గుర్తింపును ప్రశంసించిన ఆయన, ఈ కొత్త సౌకర్యాలు పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే కాకుండా పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల శిక్షణకు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.